సదావర్తి వివాదం సుప్రీంకోర్టుకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దేవాదాయ భూముల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. భూములను తక్కువ ధరకు విక్రయిస్తే చూస్తూ ఊరుకోలేమని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు చెందిన సదావర్తి భూముల వేలం పాట పారదర్శకతను కోల్పోయిన విషయం అత్యున్నత న్యాయస్థానం గుర్తించి తీవ్రంగా వ్యాఖ్యానించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గుంటూరు జిల్లాలోని అమరావతిలోని అమరలింగేశ్వర స్వామికి అనుబంధంగా ఉన్న సదావర్తి ట్రస్టు అధీనంలో తమిళనాడులోని తాలంబూరు గ్రామంలో ఉన్నటువంటి 571 ఎకరాల దేవాలయ భూముల వేలం మరింత వివాదం అయింది. గుడిమన్యాలు, చర్చి తదితర ట్రస్టు భూములే కేంద్రంగా కొన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు, కోర్టు కేసులు వంటివి తరచూ వెలుగుచూస్తుండడం కొత్తేమి కాదు. సదావర్తి భూముల వేలం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదనేది వాస్తవం. అమరావతికి వచ్చే పేద బ్రాహ్మణ విద్యార్ధులు, యాత్రికుల సౌకర్యార్ధం కొన్ని వందల ఏళ్ళ క్రితమే రాజా వాసిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ భూముల్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. చాలా ఏళ్ళుగా ఈ భూముల నుంచి ఆలయ ట్రస్టుకు ఎలాంటి ఆదాయం రాకపోవడంతో 1968లోనే వాటి విక్రయానికి ప్రయత్నాలు జరిగాయి.

తాజా బహిరంగ వేలంలో గతంలో కంటే మూడు రెట్లు అధికంగా ధర పలకడంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెయ్యికోట్లకు పైగా విలువ చేసే సదావర్తి భూములను అత్యంత తక్కువ ధరకే బిడ్డర్లకు రాష్ట్రప్రభుత్వం కట్టబెట్టిందని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. సదావర్తి సత్రానికి ఈ భూములపై టైటిల్ డీడ్ గానీ, పట్టాగానీ లేకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం ఆ భూమికి గత 60 ఏళ్ళుగా పట్టాలిస్తూ మన దేవాదాయ శాఖకు ఏ మాత్రం సహకరించలేదు. ఇలా చాలా భూములు అన్యాక్రాంతం అవడం జరిగింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ వేలం పాట నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును ఖరారు చేసింది.

ఏదేమైనా సదావర్తి భూముల వ్యవహారంలో సుప్రీం తీర్పు కీలకంగా మారిందని చెప్పవచ్చు.

Facebook Comments

Leave a Comment