చేనేతకు దక్కేనా చేదోడు?

Photo Credits: Sunil Kumar

చేనేత కార్మికుల శ్రమ శక్తిని గుర్తిద్దాం. వారి జీవితాల్లో వెలుగులు పంచుదాం. చేనేత ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిద్దాం. దాని వల్ల ఈ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, ఈ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలకు, ప్రధానంగా మహిళలకు ఉపాధి లభిస్తుంది- అని ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశమిది.

దేశంలోని మొత్తం వస్త్రాల ఉత్పత్తిలో చేనేత వాటా 12 శాతానికి తగ్గినట్లు కేంద్రప్రభుత్వం తాజా గణంకాలు నిగ్గుతేల్చడం ఈ రంగం పతనమవుతున్న తీరుకు దృష్టాంతం. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో దేశాన్ని ఏకం చేసిన చేనేత, క్రమేపీ అవసాన దశకు చేరుతుండడం ఆందోళనకర పరిణామం.  అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో సైతం చేనేత వస్త్రాల వినియోగం పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఒకవైపు అల్లుకుపోతుంటే, మన దేశంలో ఈ పరిశ్రమ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. మరమగ్గాలు, మిల్లు వస్త్రాల గుత్తాధిపత్యంలో ఈ రంగం మనుగడకే ప్రమాదం ఏర్పడింది. గడచిన పదేళ్ళలో చేనేత వృత్తిదారుల సంఖ్య 40శాతం తగ్గింది. గతంలో 295 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ వృత్తి, ప్రస్తుతం 83 జిల్లాలకు పరిమితమైంది. అక్కడా కొన్ని ప్రాంతాల్లోనే వృత్తి ఆనవాళ్ళు ఉన్నాయి.

ప్రస్తుతం చీరల ఉత్పత్తి మీదనే అధికశాతం చేనేతకారులు ఆధారపడ్డారు.  అక్కడక్కడ దుప్పట్లు, తువ్వాళ్ళు తయారు చేస్తున్నారు. 50 ఏళ్ళు దాటిన వారే దీనిపై ఆధారపడుతున్నారు. ఈ రంగం వైపు యువత పెద్దగా మొగ్గు చూపడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యం పెంపుదల, సరికొత్త డిజైన్లలో శిక్షణ, ఫ్యాషన్ షో కోర్సుల్లో చేనేతకు ప్రముఖ స్థానం కల్పించాలి. వినూత్న డిజైన్లను ప్రోత్సహించాలి. చేనేత రంగానికి ఆర్ధిక బరోసా ఇచ్చి ఆత్మహత్యలను నివారించాలి. ఆన్లైన్ వేదికల ద్వారా ప్రపంచ స్థాయి పోటీకి వాటిని ఎదగనివ్వాలి. ప్రస్తుతం 12శాతం ఉన్న చేనేత వినియోగాన్ని తగ్గకుండా పెంచడం ద్వారానే చేనేత కార్మికులకు ఊరట లభిస్తుంది. చేనేత కార్మికుల సృజనాత్మకత – భారత సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక. దీన్ని కాపాడుకోవడం ద్వారా జాతి ఔన్నత్యం పెంపొందుతుందని మన పాలకులు గుర్తించాలి.

– శ్రీనివాస్ చిరిపోతుల, వెంకటేశ్వర్ల పల్లి, జయశంకర్ భూపాల పల్లి జిల్లా.

Facebook Comments

Leave a Comment