Ganesha’s Diary Part V(బొజ్జ గణపయ్య భూలోక యాత్ర 5)


Ganesha’s Diary Part V
(బొజ్జ గణపయ్య భూలోక యాత్ర )

మూషికుడు, విఘ్నేశ్వరుడు వాయు వేగంతో మూషికా రథంలో వస్తున్నారు. కమ్ముకునే మేఘాలు చీల్చుకుంటూ మరీ వస్తున్నారు. వినాయకుడి ‘సిక్స్త్ సెన్స్’ ఎందుకో కొద్దిగా కీడు శంకిస్తుంది. వెంటనే అప్రమత్తమయ్యాడు. సడెన్ గా ఎక్కడినుండో ఒక మేఘం ఢీ కొట్టేందుకు వచ్చింది. రెప్ప పాటులో జంప్ చేసి తన గదాయుధం తో బద్దలు కొట్టాడు. ఆ మేఘం ముక్కలు ముక్కలై ఎగిరి పడ్డాయి ఆకాశంలో. మబ్బుల చాటున ఉన్న సూర్యుడు ఈల కొట్టి రెండుచేతులు పైకెత్తాడు ‘సిక్సర్’ అన్నట్టు.

“థాంక్ గాడ్..! మిస్ అయ్యాం ప్రభూ..!” అన్నాడు మూషికుడు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటూ..!

చిన్నగా స్మైల్ ఇస్తూ తలూపాడు గణపతి.

ఇంతలో మరొకటి ఎదురుగా రాబోతే దాన్ని అడ్డుకున్నాడు. ఎక్కడినుండబ్బా అని ఇద్దరు ఎదురు గా పైకి చూస్తే చాలా దూరంలో చాలా పెద్ద ‘నల్లటి మేఘం’ ఉన్నట్టు కనిపించింది. అక్కడి నుండే ఇవి పడుతున్నాయి అని అర్ధం అయ్యింది.

“స్వామీ కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి” అని ముషికుడు అంటుండగా తన బాణం సంధించాడు గజాననుడు.

బాణం రాకెట్ వేగంతో దూసుకు పోయి ఆ పెద్ద నల్లటి మేఘాన్ని తగలడంతో దిక్కులు పెక్కుటిల్లేలా శబ్దం చేస్తూ పేలిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులే సంభవించాయి. ఈ షాట్ కి ‘సూర్యుడు’ ఏకంగా తన సీట్లోనుండి బయటికి వచ్చి డాన్స్ చేసినంత సంబర పడ్డాడు.

అదే సమయంలో వీరికి తెలియకుండా ఇంకో సంఘటన జరిగింది. నిరూప్ ని బందీ చేసి తీసుకెళుతున్న ప్రేతాత్మకు.. ముక్కలైన ఓ మంచు మేఘం తగలడంతో మూర్చబోయి హిమాలయాలలో పడ్డాడు. తన దగ్గర సంచిలో ఉన్న సీసా ఇంకో లోయలో పడిపోయింది.

చిన్న చిన్న చినుకులు కురుస్తుండగా ‘కిష్కిరి లోకం’ చేరుకున్నారు. మహా గణపతికి కిష్కాధిపతి ఘనస్వాగతం పలికాడు. కిష్కుడు కేక్ కటింగ్ చేపించి బిగ్ సర్ఫ్రైజ్ పార్టీ అరెంజ్ చేశాడు. ఆత్మలన్నీ హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడాయి. బతికుంటే ఎంచక్కా సెల్ఫీలు తీసుకుని ఫేసుబుక్ అప్లోడ్ చేసుకునే వాళ్లమని.. లైకులమీద లైకులు వచ్చిపడేవని… కానీ ఇప్పుడు సెల్ఫీ దిగితే అంతా వైట్ గా వస్తుందని పైగా ఇక్కడి అకౌంట్స్ తో మనుషుల అకౌంట్స్ కి కనెక్ట్ కాలేమని ఇంకా టెక్నాలజీ ఆ దిశగా డెవలప్ కాలేదని నొచ్చుకున్నాయి. ఇంతలో అక్కడి ‘షేస్బుక్’ ఫౌండర్ బజూకర్ బర్గ్ వేదికమీదకు వచ్చి ఆత్మలను ఓదార్చాడు. వచ్చే వినాయక చవితి వరకల్లా ఇది కార్యరూపం దాల్చేలా కృషి చేస్తా అనీ గణేశుడి ఆశీర్వాదబలం ఉంటే తప్పకుంగా సాధ్యపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు.

“మంచి చేసే వారి వెంట నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆత్మలన్నీ ఇక్కడ పరిశుద్ధమై తిరిగి మహోన్నతమైన మానవ జన్మ ఎత్తాలని కోరుకుంటున్నాను, ఆ పరమేశ్వరానుగ్రహం అందరికి ఉంటుంది ” అన్నాడు గణేష్.

“మహా గణపతి ని నమ్ముకోండి… మనసులో గట్టిగా అనుకోండి చాలు మీ ప్రేమకు ‘ఫిదా’ అయిపోయి మీకు శుభం కలగచేస్తాడు..సెలవిస్తే భూలోక ప్రయాణం చేసి వస్తాం” అని మూషికుడు ముగించాడు.

‘కిష్కిరి లోకం’ అంతా హర్షధ్వనాలతో నిండిపోయింది.

అందరికి వీడ్కోలు చెపుతూ భూలోకానికి ప్రయాణమయ్యారు.

****

వచ్చి చాలా టైం అవుతుంది ఇంకా నిరూప్ రాలేదని ఎదురు చూసి చూసి భీం రావ్ కు బోర్ కొడుతుంది. అప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ పది రౌండ్లు కొట్టాడు. ఎం చెయ్యాలో తోచడంలేదు.

చివరికి పక్కనే ఉన్న ప్రసాద్ ఐమాక్స్ లో టికెట్ లేకుండా ‘బాహుబలి’ చూసి వచ్చాడు. అయినా నిరూప్ రాకపోయే సరికి తనకి పర్మిషన్ దొరకలేదేమో అనుకుని ఇక నేనే ఎదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకొని హుస్సేన్ సాగర్ లో దూకాడు. లోపలికి ఈదుకుంటూ వెళ్లి వెతుకుతున్నాడు. లోపల అంతా గజిబిజి గందరగోళంలా ఉంది. పాత సామాన్లు, ఎన్నో ఏండ్లుగా నీటి అడుగున పేరుకుపోయిన చెత్త సామాగ్రి, ప్లాస్టర్ అఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల శిథిలాలు, చేపలు, పాములు, తేళ్లు మానవ అస్థిపంజరాలు అబ్బో అదొక మురికి కూపపు కంపు లోకంలా ఉంది. నరకంలో పెట్టె శిక్షల కన్నా ఇందులో పడేస్తే అంతకన్నా పెద్ద శిక్ష ఉండదు అనిపించింది.

ఇన్ని వస్తువుల మధ్య ఒక చిన్న సీసా ను కనుక్కోవడం చాలా కష్టమే అనిపించింది. నీళ్లలో కూడా ‘గూగుల్ సెర్చ్’ ఉంటే బాగుండనిపించింది. కొంత సేపటికి బయటికి వచ్చి బుద్ధ విగ్రహం దగ్గర కూర్చున్నాడు.

“ఓర్నాయనో ఏంది ఇది..? చెరువేనా ఇంకేమన్నానా! లోపల ఇంత అద్వాన్నంగా ఉంది. గిదీన్ని చూడనీకే నా జనాలందరూ ఎగువడ్తరు.. యే ఊర్లోంచి వచ్చినా.. చివరికి అవుటాఫ్ పోయొచ్చినా ట్యాంక్ బండ్ కాడ కొంచెం సేపు కూసోని పోవాలే అనుకుంటారు.”

బుద్ధుడిని చూసి “ఏంది స్వామి గీ కంపుల ఎట్లుంటున్నవ్? నడి చెర్ల నిలవెట్టిండ్రు కదా నిన్ను..!”

నామాటే చెల్లిందనుకో.. నిన్ను తీస్కవోయి గా హైటెక్ సిటీ ల వెడ్త..! ఫస్ట్ అయితే గా మస్తాన్ ఆత్మ ‘సీసా’ ఎక్కడుందో జర దొరకవట్టియ్యి..!” ఆనుకుంటూ చుట్టూ చూస్తూ ఉన్నాడు.

కొంత మౌనం తర్వాత.. సాగర్ లో వచ్చే అలల చప్పుడుకు, ఎక్కడెక్కడినుండో వచ్చి ఎగురుకుంటూ వెళ్లే పక్షుల కిలకిల సౌండ్లకు, రోడ్లమీద వెళ్లే వాహనాల చప్పుళ్లకు వీటన్నింటికి ఎక్కడో పొత్తు కుదిరి తన ఆలోచనల వెనుక అత్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతన్నట్టు సేదతీరుతున్నాడు.

నిజమే.. ‘శబ్దంలోనూ ప్రశాంతం’ వెతుక్కునేందుకే ఇక్కడికి వస్తారేమో. ఇంత ఘోరమైన విషాన్ని కడుపులో నింపుకున్నా దాన్ని అదిమి పట్టి బయటకు మాత్రం తనకు ఎలాంటి నొప్పి లేదన్నట్టు తన చుట్టూ చేరిన జనాన్ని పలకరిస్తున్నాడు.. అందుకే ‘హాట్స్ ఆఫ్ టు హుస్సేన్ సాగర్’.

****

హిమాలయాల్లో ల్యాండ్ అయ్యారు ఇద్దరూ. రథానికి బ్రేకులు వేసి కిందికి దిగాడు మూషికుడు. సంవత్సరం తర్వాత అడుగు పెట్టేసరికి హిమగిరి పరిసరాలన్నీ పులకించి పోయి పూవుల వర్షం కురిపించాయి.

మూషికుడు మోకరిల్లి శిరసు వంచి మంచు ని ముద్దాడాడు.

‘ఈమంచూ.. ఈ నేలా.. ఈ సెలయేరు…’ ఇప్పటికీ నా మధుర జ్ఞాపకాలు అని గణేశుడు భూమాతకు నమస్కారం చేసాడు ఇలా..
“తల్లి భూమాత! దివి నుండి భువికి రప్పించావు.. నా ఈ యాత్రను నిర్విఘ్నం గా సాగిపోవాలి..!
“నిన్నే నమ్ముకుని బతుకుతున్న నా భక్తులకు యేఆటంకము రానీయకుండా చూడుతల్లి.!

మెగాస్టార్ చిరంజీవి ‘ఘల్లు ఘల్లు మని సిరిమువ్వల్లే’ సాంగ్ ఎక్కడో దూరంగా ప్లే అవుతుంటే కొంచెం సేపు ఆనంద తాండవం చేసాడు. తరువాత పినతల్లి ‘గంగా దేవి’కి నమస్కరించి నదిలో దూకి జలకాలాడాడు. ఎప్పుడు భూమి మీదకి వచ్చినా ఇదే ఆనవాయితి.

తనివి తీరా నీటిలో ఆడుకున్న తర్వాత ఇక వెళ్దాం ప్రభు సాయం కాలం కావస్తుంది అనేసరికి లేచి బయటికి వచ్చాడు. నది ఒడ్డున నడుస్తుంటే ఏర్పడ్డ ‘పాదముద్రలు’ కొంతసేపు అలాగే మెరుస్తూ ఉండిపోయాయి.

‘ప్రోటోకాల్’ ప్రకారం ఇద్దరూ మరువేషం వేసుకున్నారు. బస్సు, టాక్సీ, ట్రైన్ ఏది దొరికితే అది.. దొరకనప్పుడు మూషికరధం ఎక్కి గుళ్ళు గోపురాలు సందర్శిస్తూ అన్ని విగ్రహాల్లో తన ‘ఆత్మ జ్యోతి’ని వెలిగిస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ తిరుగుతున్నారు. ఇటు ప్రయాణం చేస్తూనే గుళ్ళల్లోనే కాదు గల్లీల్లో కూడా పూజారి విగ్రహప్రతిష్ఠ చేసినా.. ఇండ్లల్లో పూజ చేసినా ఆత్మ జ్యోతులను పంపిస్తూ వస్తున్నాడు.

“స్వామీ ఎప్పుడు వచ్చినా ఎక్కువగా ముంబయి, హైదరాబాద్ లలోనే ఉంటారు ఈసారి లొకేషన్ మార్చకూడదా..?”

“లేదు మూషికా..! అప్పుడప్పుడూ క్యారెక్టర్ ని బట్టి కొత్తగా ట్రై చేస్తుంటాం.. కానీ ‘విష్ణు అంకుల్’ ఈసారి వెరైటీ గా ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉండేటట్టు ప్లాన్ చేసాడు. నాకు అది నచ్చింది. ఇప్పటికే రాత్రి కావస్తుంది మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి”.

****

హిమాలయాల్లో నది లో ‘ఏకాంతుడ’నే ముని స్నానం చేసి వస్తుంటే ఇంకా వెలుగుతూనే ఉన్న గణేశుడి పాదముద్రలు చూసి అవాక్కయ్యాడు. అడుగులు కొంత దూరం వరకు కనిపిస్తున్నాయి. ఆ అడుగులు చూస్తుంటే చాల ఆత్మీయానుభవం కలిగింది. తన చేతితో స్పర్శించే సరికి ఆ వెలుగు తన దేహమంతా పాకిపోయింది. తెలియని సంతృప్తి తో నిండి పోయింది మనసంతా. తన తపఃశక్తితో ఏంటో తెలుసుకోవాలని చూసాడు కానీ ఏమి అర్ధం కాలేదు.ఆకాశవాణి పలికింది ఏకాంతుడితో..

“ఎకాంతుడా..! అన్నీ వొదిలేసి ఒంటరివై మరో జన్మంటూ ఉండద్దని గణేశుడు లో ఐక్యం కావాలనే నీ ఇన్నేళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఆ గణేశుడే మోక్షం కలిగించడానికి వచ్చాడు. అడుగుల కాంతిని నువ్వు తాకినప్పుడే గణేషుడిలో ఐక్యం కావలసింది కానీ విష్ణుదేవుడెందుకో ‘స్టే’ ఇచ్చాడు. నీతో ఇంకో కార్యం చేపించడానికి అనుకుంటున్నాను”.

ఏకాంతుడు చాలా ఆనందంతో “ఏమి చెయ్యాలో చెప్పండి తల్లి ఇప్పుడే చేస్తాను” అన్నాడు

“అది ఇంకా నాకు తెలియదు. కానీ ఆ వెలుగు నిస్తున్న ఇసుకని కొంత నీదగ్గర పెట్టుకో.. సమయం వచ్చినపుడు ఎం చెయ్యాలో నేను చెపుతాను. స్టే ట్యూన్డ్ ఫర్ ది అప్ డేట్స్” అని ఆపేసింది.

“ధన్యోస్మి అని ఏకాంతుడు దోసిళ్ళతో ఇసుకని తీసుకుని ఒక క్లాత్ లో కట్టి జోలెలో వేసుకుని ఆశ్రమం బయలుదేరాడు.

****

రాత్రయ్యేసరికి సికింద్రాబాద్ చేరుకున్నారు. నగరం డప్పుల మోత మోగిస్తోంది. విగ్రహాలన్నింటినీ మండపాలల్లోకి ఇంకా తీసుకెళుతూనే ఉన్నారు. ఎక్కడ ఏ గల్లీ లో చూసినా ‘మండపాలు’ కిక్కిరిసిన జనంతో.. సంతోషంతో సంబురాల్లో మునిగి తేలుతున్నాయి. సన్నటి వర్షంతో వానదేవుడు “భక్తి సంద్రం” లో తడిపిస్తున్నాడు.

“అబ్బా.. ఈరోజుకు చాలు స్వామి. చాలా అలసి పోయాను.. రేపు ఎక్కడికి వెళ్లాలో సెలవియ్యండి.. తొందరగా పడుకొని పొద్దున్నే ప్రిపేర్ అవుతాను” అలసిన స్వరంతో అన్నాడు మూషికుడు.

“సరే అయితే ఇక్కడ దగ్గర్లోనే ఉండి రేపు పొద్దున్న ‘ఖైరతాబాద్ వినాయకుడి’ మండపం వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకో
అందరు భజనలు చేస్తూ నిద్రపోయే సరికి నాకెలాగూ లేట్ అవుతుంది” గణేషుడి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది.

‘బొజ్జ గణపయ్య’ని భారీ ఊరేగింపు తో రైల్వే స్టేషన్ పక్కనున్న వినాయకుడి గుడికి తీసుకు వచ్చారు.

“జై బోలో గణేష్ మహారాజ్ కీ.. జై..!”

(ఇంకా ఉంది)

Click here for part IV

Click here for part III

Click here for part II

Click here for part I

-అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Facebook Comments

Leave a Comment