Ganesha’s Diary Part IV (బొజ్జ గణపయ్య భూలోక యాత్ర!)

Ganesha’s Diary Part IV
(బొజ్జ గణపయ్య భూలోక యాత్ర)

అక్కడ అంతా గుంపుగా ఉండటంతో ఏంటో చూడాలని నిరూప్ వెళ్ళాడు. ఒక సినిమా నటి ఆమె జీవించి ఉన్నప్పటి సినిమా జీవిత విశేషాలు అన్ని పంచుకుంటుంటే క్యూరియాసిటీ తో వింటున్నారు అందరు.

“ఓహో ఇక్కడ కూడా సినిమా క్రేజీ ఏమాత్రం తగ్గలేదన్న మాట, కాలక్షేపం కోసం ఎదో విదంగా ఎంగేజ్ చేసుకోవాలి కదా”.. అనుకుంటూ ఒంటరిగా ఓ మూల కూర్చున్న భీం రావ్ దగ్గరికి వెళ్ళాడు.

“భీం రావ్..! ఏందీ ఇక్కడ కూర్చున్నావ్”

భీం రావ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.

“నేను అనుకోలేదు భీమా వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని. మనిద్దరిని టార్గెట్ చేసి చంపేస్తారని అస్సలు అనుకోలేదు.

“లేదన్నా వాళ్ళ లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు ఎం తెల్వదు నన్నిడిసి వెట్టుర్రి అని ఎంత మొత్తుకున్నా ఇన్లేదు. నా తర్వాత నీ దగ్గరికే వచ్చిండ్రు.. నిన్ను చంపేటప్పుడు నేనూ ఉన్నా.. ఎంత ట్రై చేశినా నా వల్ల కాలేదన్నా! ఎవలనైనా పిలుద్దామని బయటికి వచ్చి ఆడ ఈడ తిరిగిన కానీ యెవ్వలు కనపడలే. మళ్లొచ్చేసరికి నువ్వు లెవ్వు. ఇంకెవర్ని సంపుతారో అని వాళ్ళ వెనునుకనే పోయిన.. ఒకరోజంతా వాళ్ళతోనే ఉన్న.

అన్నా అందులో ఒకడు మనిషి కాదన్నా మనిషి రూపంలో ఉన్న ‘ప్రేతాత్మ’. వాడు చాలా పవర్ ఫుల్ అన్న.

“ఎవడు వాడు ఏంజరిగింది?”

“నల్లగా, మొఖం మీద గాట్లు పెట్టుకోని అందరికి లీడర్ గ ఉన్నోడే అన్న. మనకు ఎదో చెప్పబోయి చనిపోయిన మస్తాన్ ను వాడే చంపిండు. అంతే కాదన్నా మస్తాన్ ఆత్మను కూడా బాటిల్ లో ఇరికించి హుస్సేన్ సాగర్లో పడేశిండు. నన్ను సూడలే.. అదే టైం ల నా డెడ్ బాడీ తో అంబులెన్స్ కనిపించింది. లాస్ట్ ఛాన్స్ కదా చుట్టాలను నా లవర్ ని చూడాలని ఊరికి పోయిన అన్న నా శవం తో పాటే.

“అన్నా ఇంకో సంగతి.. వాడు ఇక్కడనే తిరుగుతున్నాడు. మన కోసమే వచ్చిండేమో”.

“అవునా అయితే వాడిని పట్టుకొని అడిగితే తెలుస్తుంది అసలు సంగతి”

“అన్నా వాడు చాలా పవర్ ఫుల్. మనం ఏ వస్తువును ముట్టుకోలేకపోతున్నాం వాడు మనిషిలాగానే అన్ని చేస్తున్నాడు. మనల్ని గిట్ల బాటిల్ లో తీస్కవోయి ఏ సముద్రంలో నో పడేస్తే ఏం చెయ్యనీకి ఉండదు.”

నిజమే..! అయితే ఫస్ట్ అస్సలు కథేందో తెలుసుకోవాలి. ఇంకా మనం అన్నింటిని ముట్టుకోవడం, కదిలించడం ఎట్లనో నేర్చుకోవాలి.
కిష్కిరి ‘లోక నాయకుడు’ కిష్కుడు అక్కడికి రానున్నాడని కొత్తగా వచ్చిన ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నా ఆడిటోరియం వద్దకు రావాలని అనౌన్స్ చేయబడుతుంది. దిల్ దార్ సింగ్ కొత్త ఆత్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుని వాళ్ళను తీసుకెళ్తున్నాడు.

“దార్ సింగ్ జి.. మమ్మల్ని ఎందుకు కలుస్తాడు కిష్కాధిపతి” అడిగాడు ఆతృత గా భీం రావ్”

“ ఆత్మలను కలిసి మొదటి కోరికను తీర్చడానికి, వాటికి గల తీరని చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. కోరికలో నిజాయితీ ఉంటే సరిగ్గా కన్విన్స్ చేయడానికి నిర్నీత సమయం కేటాయించ బడుతుంది”.

“ఎలాంటి కోరికలు”

“కొంతమందికి చివరి సమయంలో హాయిగా బిరియాని తినాలని ఉండే అంటుంటారు. కొందరికి మందు తాగాలని కొందరికి విహార యాత్ర చేయాలని ఉండే అని.. పిల్లలను కడసారి చూసొస్తామని ఇలాంటివే.. వారి మనోభావాలను బట్టి కోరికలు”.

“అన్ని తీరుస్తారా?”

“తీర్చే వీలున్నవన్నీ.. అంటే బిర్యానీ లాంటివన్నీ ఇక్కడికే తెప్పిస్తారు.. కొందరు కవులు మాకు కవితలు వ్రాయాలని ఉంది అంటే ఇక్కడనే రాయమంటారు.. అదే నేను రాసిన కవితలన్నీ ఒక డైరీ లో ఉన్నాయి పుస్తకం అచ్చు వేద్దాం అనుకున్న కానీ కుదర్లేదు అంటే నిజంగానే ప్రయత్నాలు చేశాడా అని కనుక్కొని వీలైతే ఆత్మను భూలోకానికి పంపిస్తాడు. వాళ్ళు ఏదోవిధంగా వాళ్ళ డైరీ నీ వారసులకో, ఆత్మీయులకో దొరికేటట్టు ప్రయత్నించాలి. వారసులు వ్రాసిన వారి జ్ఞాపకార్థం పబ్లిష్ చేస్తారు. అలాగే వీలునామా లాంటివి.”

అప్పుడే మెరుపులాంటి ఆలోచన వస్తుంది నిరూప్ కు.. ఎలాగైనా తన చావుకు కారణం ఏంటో తెలుసు కోవాలని అనుకున్నాడు. ఇదే విషయాన్నీ భీం రావ్ కు చెప్పాడు. భీంరావ్ కూడా సరే అన్నాడు.

“అన్నా మనల్ని చంపినవాళ్లు ఆపరేషన్ ‘సానిమ్’ సక్సెస్ కావాలని తరచూ మాట్లాడేవారు. “మన సానిమ్ కి అడ్డొచ్చే వారెవరైనా చచ్చిపోవాల్సిందే” అన్నారు. నాకేం అర్ధం కాలేదు అన్నానీకేమైనా తెలుసా”

“లేదు భీమా వాళ్లెవరో చెప్పలేదు డైరెక్ట్ గా వచ్చి చంపేశారు. ఉద్యోగానికి రాజీనామా చేయమంటే ఎందుకు చేయలేదు అని మాత్రం అన్నారు. అంటే ఒకవిధంగా ఇది మన ఆఫీస్ కి రిలేటెడ్ లాగాఉంది చూద్దాం” అన్నాడు.

“అన్నా.. మస్తాన్ ఆత్మ ఇంకా హుస్సేన్ సాగర్ లోనే ఉంటది కావచ్చు. అతన్ని కలిస్తే ఏమైనా చెప్తాడేమో?”

“అవును.. ముందు ఎట్లా అయినా భూలోకం వెళ్ళాలి.” ఆలోచిస్తూ చెప్పాడు నిరూప్.

యముడు దగ్గర చిత్రగుప్తుడు ఉన్నట్టు కిష్కుడి దగ్గర ఆత్మగుప్తుడు అసిస్టెంట్ గా ఉన్నాడు.

ఇద్దరూ ఒకే క్యాబిన్ లో మాట్లాడుకుంటున్నారు.

“ఆత్మగుప్తా..! కిష్కిరి విశేషాలేమి?

“మీకు తెలియందేమి ప్రభూ.. పాపాత్మల సంఖ్య రోజు రోజు కూ పెరుగుతూ ఉంది. యమలోకంలో శిక్షలు తొందరగా అయిపొవట్లేదు. ఖాళీ లేని సందర్బంగా మనమే కొత్తగా వచ్చిన ఆత్మలకు తీరని కోరికల పేరిట భూలోకం పంపిస్తున్నాం. ఉన్నవాటిని ఏదోవిధంగా ఎంగేజ్ చేస్తున్నాం. మంచి ఆత్మలు కొంతకాలం తర్వాత భూలోకం లో మల్లి పుడుతున్నాయి. మహాత్మలకు త్రిశంకు స్వర్గంలో కావలిసినంత ప్లేస్ ఉంది. కానీ వచ్చే వారు తక్కువ. వారి మరణాల సంఖ్య విపరీతంగా తగ్గింది”.

“అదేంటి భూలోకంలో అంతా కల్తీ అయిపోయి సరైన ఆహారం లేక చివరికి నీరు కుడా కలుషితం అయి అవస్థ పడుతున్నారు కదా”.

“నిజమే ప్రభూ.. కానీ మెరుగైన ఆరోగ్యసేవలంటూ మహా మహా ఆసుపత్రులు వెలిసాయి. సహజ మరణాల సంఖ్యను చాలా తగ్గిస్తున్నాయి. నేర సామ్రాజ్యం విస్తరించి చివరికి వారిచ్చే మందులలో కూడా కల్తీవి వచ్చినా.. ప్రాణాలు నిలబెట్టే స్థాయిలో ఆసుపత్రులు పని చేస్తున్నాయి. మంచి ఆహారం దొరక్క పోయినా, గాలీ, నీరు ఎంత కలుషితం అయినా మానవుడు అవస్థ పడుతున్నాడు. కానీ బతికే ఉన్నాడు. అవస్థలన్నింటిని తన జీవన విధానంలో ఒక భాగంగా మలుచుకున్నాడు.

మన దగ్గరికి ఎక్కువగా వచ్చేవి ఆక్సిడెంట్ అయ్యో, హత్యలు చేయబడో లేదా ఆత్మహత్యలు చేసుకున్నవే. ఆత్మహత్య మహా పాపం అని ఇక్కడికి వస్తే గాని తెలియదు వాటికి. పాప పుణ్యాలను లెక్కించే కాలం సరిపోదు కనుక ఆయుష్షు తీరేంత వరకు వాటికి మరో జన్మ ఉండదు. అభం శుభం తెలియని పసివయసులో వచ్చినవారకి మాత్రమే మినహాయింపు ఇచ్చాడు పరమేశ్వరుడు.

అందుకే అన్నిటికంటే మానవ జన్మ ఉత్తమ మైనదని రెగులర్ గా ఎక్సట్రా క్లాస్ లు తీసుకుంటున్నాం.

ఆత్మలన్నీ ఎక్కువ కాలం కిష్కిరి లో నే ఉండేసరికి ఇక్కడా దీర్ఘకాల మిత్రులను ఏర్పరుచుకుని ఉంటున్నారు. కొందరైతే గ్రూప్ గా ఏర్పడి సంఘాలు గా మారుతున్నాయి. ఆత్మా కాలం అయిపోయి వెళ్ళిపోయిన సీనియర్ ఆత్మల పేరిట అభిమాన సంఘాలు కూడా వెలిశాయి. చివరికి ఆత్మగౌరవం అంటూ ఏకంగా కిష్కిరి లోకానికే ‘ఆత్మపురి’ అని పేరు మార్చాలని ఒక వర్గం పోరాడుతుంది స్వామి”.

“ఉ..ఉమ్…. నిన్ను కదిలిస్తే ‘ఆత్మపురాణం’ అంతా చెప్తావ్ కానీ చాలా జాగ్రత్తగా అందరిని గమనించు. రాక్షస లోకం నుండి తరచూ మనతో పొత్తు పెట్టుకుందామని అక్కడ ఆత్మలను విహార యాత్రకు అనుమతించాలని ప్రపోజల్స్ వస్తున్నాయి. అది ముమ్మాటికీ జరగకూడదు ఎందుకంటే పాపాత్మలను అట్ట్రాక్ట్ చేసి రాక్షసులు వినియోగించుకుంటున్నారని ఈమద్యే నారద మహర్షి లాప్ టాప్ క్రాష్ చేసారని వాట్సాప్ లో అలెర్ట్ మెస్సేజ్ వచ్చింది”.

ఇద్దరు మాట్లాడుతుండగా దిల్ దార్ సింగ్ వచ్చి.. “ దేవా.. కొత్త ఆత్మలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి” అన్నాడు.
ఆత్మలన్నీ ఎవరికీ వారు పరిచయం చేసుకుని భూలోకానికి పర్మిషన్ దొరకడంతో సంతోషంగా తిరిగి వెళ్తున్నాయి.

“నిరూప్ నీకోరిక ఏంటి” అడిగాడు దిల్ దార్ సింగ్

“నేను భీం రావ్ ఇద్దరం ఒకే ఆఫీస్ లో పని చేసేవాళ్ళం, సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే ఒక హత్య జరిగింది, చావు బతుకులో ఉన్న అతని తో మాట్లాడాము కానీ మాకేమి చెప్పలేదు. అయితే అతన్ని చంపినవాళ్లు మమ్మల్ని కూడా చంపేశారు, కారణం తెలుసుకొవాలని ఉంది” అని చెప్తాడు.

“అయ్యో ఇలాంటి వాటికి ఒప్పుకోరు.. ప్రతీకార ద్యేయంతో పిశాచాలు గా, ప్రేతాత్మలు గా మారుతారని.. ఇంకేదైనా కోరుకోండి”.. సీక్రెట్ చెప్పినట్టు చెప్పాడు.

భీంరావ్ టైం రావడంతో “ప్రభూ నేను హుస్సేన్ సాగర్లో హాయిగా ఈత కొట్టాలని ఎప్పుడూ ఆశగా ఉండే స్వామీ.. కానీ అక్కడ నీళ్లన్నీ ఖరాబ్ అయ్యేసరికి కంపు వాసన భరించలేక ఎప్పడు దిగలే.. ఆ వాసన రాకుండా హాయిగా వారం రోజులు ఈత కొట్టాలని ఉంది స్వామి” ఒప్పుకోవాలని మనసులో దేవుడిని ప్రార్థిస్తూ చెప్పాడు.

“ఇదీ ఒక కోరికనా ..?! అన్నట్టు చూసాడు కిష్కుడు ఆత్మగుప్తుడి వైపు.

“స్వామి ఆత్మలు ప్రాణవాయువు మాత్రమే తీసుకుంటాయి కదా అయినా వాటర్(H2O) లో ఆక్సీజన్ ఉంటుంది కదా” పర్వాలేదు పంపించొచ్చు అన్నట్టు సైగ చేస్తూ చెప్పాడు ఆత్మగుప్తుడు.

సరే అని తల ఊపుతూ చెప్పేసరికి భీం రావ్ ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయింది. బయటికి వచ్చి సంతోషంగా ఎదో వరల్డ్ కప్ గెలిచిన వాడిలా గెంతుతూ వచ్చాడు.

“అన్నా..! ఎదో ఒకటి చెప్పి తొందరగా రా ఇద్దరం కలిసి పోదాం” అన్నాడు భీం రావ్

“లేదు పర్మిషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఉండొద్దు ఇక్కడ.. వెంటనే పోవాలి లేదంటే ఇతర ఆత్మలన్నీ చుట్టుముట్టి వాళ్ళ వాళ్ళ చుట్టలతో కలిసి రావాలని రాయభారం నడుపుతాయి” అని దిల్ దార్ సింగ్ చెప్పాడు.

“సరే అన్న.. అయితే తొందరగా రా నేను ట్యాంక్ బండ్ మీద వెయిట్ చేస్తా” అని వెళ్ళిపోయాడు.

ఇంకో పది మంది తర్వాత తన వంతు వస్తుందనగా ఆరోజుకి అన్ని అపాయింట్ మెంట్స్ అయిపోయాయని విఘ్నేశ్వరుడు వస్తున్నాడని అనౌన్స్ చేశారు.

ఆత్మలన్నీ గణేశుడిని చూడాలని ఒక్కసారిగా అక్కడ చేరాయి. ఇసుక పోస్తే రాలనంత ఆత్మల సమూహము అది. అన్ని ఒకదానిని ఒకటి నెట్టుకుంటూ నేనంటే నేను ముందు ఉండాలి అన్నట్టు చూస్తున్నాయి. ఊపిరి ఆడనంత గుంపులోనూ నిరూప్ ని ఎవరో బలవంతంగా లాక్కుపోయి దూరంగా పడేసాడు. ఎవరా అని చూస్తే తనని భూలోకంలో చంపిన వాడు.

లేచి ఎందుకు అని అడిగే సమయం కూడా ఇవ్వకుండా సీసా లో బంధించి ఎగిరిపోయాడు.

(ఇంకా ఉంది)

Click here for part III

Click here for part II

Click here for part I

-అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Facebook Comments

4 Comments on this Post

  1. Very nice article, totally what I was looking for.
    Günstige Real Madrid Vinicius Júnior Fußballtrikots

  1. […] Ganesha’s Diary Part IV (బొజ్జ గణపయ్య భూలోక యాత్ర!) […]

  2. […] పార్ట్ http://www.telangana4u.com సాహిత్యం పేజీ లో Part 2 Part 3 Part 4 Part […]

  3. […] Ganesha’s Diary Part IV (బొజ్జ గణపయ్య భూలోక యాత్ర!) […]

Comments have been disabled.