‘తెలుగు భాషా దినోత్సవం’ శుభాకంక్షాలు!

‘తెలుగు’ అభిమానులందరికీ వందనాలు. ఎందుకంటే నేడు తెలుగు భాషా దినోత్సవం.

Image Credits: indiathedestin

“ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్, ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ భాషలు ఎట్లున్నవో అట్లే తెలుగు దేశంలో కూడా పెద్దల నోట వాడే తెలుగు భాషకు సాధ్యమైనంత దగ్గరగా తెలుగు రాతను తెచ్చి, నోటి మాటా, చేతిరాతా ఒకదానికొకటి పోషకాలుగా చేసి రెండింటికినీ సమంగా ప్రవృత్తి కలిగించి, రాత సార్థకంగానూ సులభంగానూ చేసి, తెలుగు వారు రాసే, మాట్లాడే భాష
కూడా సభ్య భాషే అనే గౌరవము సంపాదించటమే మేము తలపెట్టిన ప్రయోగం. ఇదే మా దృష్టిలో వాస్తవమైన భాషాభిమానం” అని నిర్మొహమాటంగా తెలియ జేసిన ఘనుడు, తెలుగు చైతన్యానికి స్ఫూర్తి ప్రదాత “గిడుగు రామ్మూర్తి పంతులు” గారు. ఆయన జన్మ దినాన్నే మనం “మాతృ(తెలుగు)భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాం.

1863 ఆగష్టు 29 న శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేటలో జన్మించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు గొప్ప పండితుడు, బహు భాషావేత్త, సంస్కృత ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు. వ్యావహారిక భాషోద్యమాన్ని చేపట్టి నిరాటంకంగా నిర్వహించారు. ‘తెలుగు’ మాస పత్రిక పెట్టి సాహిత్య సేవ చేసారు. అంతేకాక హరిజనాభ్యుదయం గురించి, నిమ్న జాతుల వారి కోసం సొంత ఖర్చుతో ఒక పాఠశాల స్థాపించారు. తెలుగు భాష మృత భాషగా మారబోతోందని గ్రహించి గట్టి పోరాటం చేసారు. అలాంటి మహనీయుని జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవం గా ప్రకటించి వేడుకగా జరుపుకుంటున్నాం ఇప్పటివరకూ. ఆయన్ని తలచుకుంటూ.. ఈ రోజు మనం మన తెలుగు భాష మనుగడ గురించి కొంత మాట్లాడుకుందాం….

“తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా” అంటూ ఆవేదనతో ఆవేశ పడ్డారు కాళోజీ.

తెలుగులో చదువుకోవటం వల్ల కానీ, తెలుగులో మాట్లాడటం వల్ల కానీ పిల్లల భవిష్యత్ అభివృద్ధికి ఆటంకమవుతుంది అనే భావన బలంగా నాటుకుపోయింది. అందుకే ముందు మనం మన భాషను ఎందుకు ప్రేమించాలి.. తెలుసుకుందాం…

నేడు ప్రపంచంలో 6,500 భాషలు వ్యవహారంలో ఉన్నాయి. ప్రపంచంలో అన్ని భాషలు మొదట ధ్వని రూపంలోనే ఉంటాయి.నోటితో పలకబడేదే భాష. భాషలో భావ వ్యక్తీకరణ ముఖ్యం. గాడిదలు ఓండ్ర పెడతాయి. సింహాలు గర్జిస్తాయి. పిట్టలు కూస్తుంటాయి. సహజ ప్రవృత్తుల వల్ల ఆ జీవులు అలా ప్రవర్తిస్తుంటాయే తప్ప, వాటికి భాషించే శక్తి లేదు. మానవులకు మాత్రమే భాషించే శక్తి ఉంది.

Image Source: Encyclopedia of Telugu

మాట్లాడటం ద్వారా మానవుడు తన మనోగత భావాల్ని ఇతరులకు అర్థమయేలా వ్యక్తీకరించగలుగుతాడు. ఆకలి, దాహం, కోపం, ఉద్రేకం లాంటి మనోభావాలు మనిషి మెదడులో పుట్టినప్పుడు ఇతరులకు స్పష్టంగా అర్థం అయేట్లు తెలిపే వాగ్రూప ప్రక్రియే భాష. ఈ భాష అనేది సృష్టిలో మనిషికి మాత్రమే గల అపూర్వ సాధనం. ఈ వాగ్రూపమైన, ధ్వనుల సమాహారమైన భాష క్షణికం, తత్ క్షణం నశించేది. కావున సాధ్యమైనంత ఎక్కువ కాలం స్థిరంగా ఉంచేందుకు, కాలగర్భంలో తత్ క్షణం కలిసి పోకుండా ఉంచేందుకు మానవులు “లిపి”ని కనిపెట్టారు. దీనికి అక్షరం అని పేరు పెట్టారు. క్షరమంటే నశించేది. అక్షరమంటే నశించనిది. లిపిని ఎవరు కనిపెట్టారు? అనే ప్రశ్నకు అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం అది వదిలేద్దాం.

భారతీయ లిపి అతి ప్రాచీనమైనదని భావింపబడుతోంది. బ్రాహ్మీ లిపి భారతీయ లిపులకు మూలమనీ, తెలుగు కూడా అందునుండి ఉద్భవించిందేనని చెప్పబడుతోంది. బ్రాహ్మీ లిపి – దక్షిణ బ్రాహ్మీ లిపి – అందులో మళ్ళీ వేంగి లిపి – తెలుగు లిపి ఈ క్రమం లో ఉద్భవించినట్లుగా తెలుస్తోంది. మూల లిపి నుంచి ఉద్భవించ బడినప్పటికీ తెలుగు భాష విభిన్న పదజాలం, భావ స్పష్టత అధికంగా కలిగి ఉందని నిర్థారింపబడింది. ఇంత కష్టపడి మన పూర్వీకులు ఏర్పరచుకున్న తెలుగు భాషా లిపి రాను రానూ అనేక ప్రభావాలకు లోనవుతూ, మార్పులు పొందుపరచుకుంటూ వచ్చింది.

భారత దేశానికి పరజాతి పాలన కొత్త కాదు. క్రీ.పూ. నుంచి అనేక విదేశీ దాడులకు గురవుతూ వచ్చింది. ఆయా సమయాల్లో మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు అనేక ప్రభావాలకు గురయ్యాయి. మరీ ముఖ్యంగా పాశ్చాత్యుల పాలనా సమయంలో మన దేశ ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహార్యాలతో పాటు భాషపై కూడా కొన్ని మార్పులు పొడచూపాయి. వారి యొక్క వైజ్ఞానిక సంబంధమైన పరిజ్ఞానం మన దేశీయులను విభ్రమకు గురిచేసింది.

17, 18 శతాబ్దాల్లో తెలుగు బాగా వికసించి, క్రమంగా క్షీణించింది. క్రీ.శ. 1800 నుంచి నేటి వరకు కాలాన్ని భాషాపరంగా ఆధునిక యుగంగా పరిగణిస్తున్నారు. అప్పటికే “తెలుగు” పై ఇంగ్లీషు భాష ప్రభావం ప్రారంభమై ఆధునిక స్వరూపాన్ని సంతరించుకుంది. వ్యవహార పత్రాల్లో కూడా ఆంగ్ల పదాలు ప్రవేశింప సాగాయి. అలా అలా ఇంగ్లీషు భాష అనధికారికంగా సత్వర జీవన అభివృద్ధికి దోహద పడే భాషగా ప్రజల్లో భావన ఏర్పడిపోయింది. అప్పటి రోజుల్లోనే, ఇంగ్లీషు వారైనప్పటికీ మన తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని గ్రహించిన వారై, కల్నల్ కాలిన్ మెకంజీ, విలియమ్ కెరే, మారిస్ సోదరులు, ఎ.డి క్యాంబెల్.. వంటి వారు తెలుగు భాష అభివృద్ధికై పాటుపడ్డారు. సి.పి.బ్రౌన్ భాషా సంబంధమైన పరిశోధనకు బీజం వేయటమే కాక, సాహిత్య వృద్ధికై ఎనలేని కృషి చేశాడు.

విదేశీయులే అచ్చెరువెందేలాంటి మాధుర్యం కలిగిన మన తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ఏ భాషైనా వ్యవహార బలం చేతనే మనుగడలో ఉంటుంది. మరి తెలుగు చదవలేని రాయలేని తరం తయారవుతుంటే, వ్యవహారంలో అంతరించి తద్వారా తెలుగు జాతి అనేదే అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే భాష విషయంలో ప్రాంతం, యాస అంటూ దురభిమానాలు పక్కనపెట్టి అందరం ఒకే తెలుగు జాతిగా సంఘటితమై తెలుగు భాష మనుగడకై మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్తు కోసం అన్ని విద్యలూ నేర్చినట్లే ఆంగ్లాన్ని నేర్చుకున్నప్పటీకీ, మనం మాట్లాడే భాష కనీసం చదవటం, వ్రాయటం అయినా వచ్చి ఉండేలా బోధన వ్యవస్థలో మార్పు తెచ్చుకోవాలి. మాతృభాష ప్రాముఖ్యతను ప్రచారం చేయవలసి ఉంది. తద్వారా తెలుగు జాతిని కాపాడుకోవలసి ఉంది.

~ ఫణి మాధవి కన్నోజు ~

Facebook Comments

Leave a Comment