ప్రతికూల ప్రభావం చూపని కార్యక్రమాలు కావాలి!


నేటి మన జీవన విధానంపై అనేక రకాల ప్రభావాలు. అందులో మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, సినిమాల ప్రభావం ఎంతో అందరికీ తెలిసిందే. చిన్న, పెద్ద వయోబేధం లేదు. కుల, మత, పేద, ధనిక తారతమ్యం లేదు. ప్రతీ ఒక్కరూ వీటి ప్రభావానికి గురి కావలసిందే.

ప్రతి నట్టింట్లో వచ్చి చేరిన టెలివిజన్, అరచేతిలో విశ్వాన్ని చూపే మొబైల్ ఫోన్ మనపై చూపే ప్రభావం చెప్ప తరం కాదు. నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయిన ఈ రెండు వస్తువులు చూపే ప్రభావం కొంత అనుకూలమైనది ఉన్నా, ప్రతికూల ప్రభావాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

సినిమా, ఫోన్ కన్నా ప్రతి ఇంట్లో చిన్న, పెద్ద ప్రతి కుటుంబ సభ్యులకు సులభంగా చేరువవుతున్న ప్రసార సాధనం టెలివిజన్. కాబట్టి ఈ టెలివిజన్ ఛానల్స్ సమాజం పట్ల కొంత బాధ్యతను కలిగి ఉంటాయి. వాణిజ్య పరమైన లాభాలు తేలేని కార్యక్రమాలు ప్రసారం చేయలేని అశక్తత వారికుండి ఉండవచ్చు. కానీ, వాణిజ్యంతో పాటు కాస్త విలువలు గల కార్యక్రమాలు రూపొందించటం వారి బాధ్యత కూడా అని మాలాంటి సామాన్య, సాధారణ గృహిణులైన మహిళల అభిప్రాయం. మేము, మా పిల్లలు కలిసి కుటుంబ సభ్యులు యావత్తూ చూడగలిగిన కార్యక్రమాలు ఎన్ని రూపొందుతున్నాయి? వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సీరియల్స్ ఎందుకు.. ఏం చెప్తారో.. ఎందుకు సాగదీస్తారో.. వాళ్ళకే తెలియాలి వాటిని వదిలేయండి. కొంత మందికైనా ప్రయోజనం కలిగించే పాటలు, నృత్యాల పోటీల వంటివి పక్కన పెడితే.. కొంత విజ్ఞానానికి సంబంధించి క్విజ్ కార్యక్రమాలు వంటివి ఎక్కడో ఒకటి ఉంటున్నాయి. అర్థం కానిదేంటంటే ఒకరెవరో వెకిలి చేష్టలు, మాటలు, ద్వంద్వార్థాలే హాస్యం అనే రీతిలో కార్యక్రమం రూపొందించి, ప్రసారం అయి, దానికి మంచి టి ఆర్ పి రేటింగ్ వచ్చింది కదాని అదేదో ప్రేక్షకులంతా కోరుకునే వినోదం ఇదేననుకుంటూ మిగతా ఛానల్స్ అన్నీ అలాంటి కాన్సెప్ట్ తోనే కార్యక్రమాలు రూపొందించి ప్రజల మీద వదలటం. ఒక కార్యక్రమంలో ఇంటి గొడవలను వీధికెక్కించి ప్రపంచమంతా చూపిస్తే అదేదో గొప్ప ప్రోగ్రామ్ అనుకుని మిగతా ఛానల్స్ అనుకరించటం.. ఏం.. సరే.. వినోదమే ప్రధానం అనుకుంటే.. అదే మూసలో ఎందుకు.. దానికి భిన్నంగా ఒక మంచి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించలేరా? భిన్నంగా ఆలోచించలేరా? ఆ సృజనాత్మకత లేదా?

విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు అడపా దడపా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటాయి. వాటి ప్రసార సమయం తక్కువే. సమాజంపైన అనుకూలమైన ప్రభావం చూపకపోయినా ఫరవాలేదు, ప్రతికూల ప్రభావం చూపే కార్యక్రమాలు నియంత్రించితే మంచిదని మాలాంటి సామాన్య ప్రేక్షకుల అభిప్రాయం.

ఇలాంటి అసంతృప్తితో ఉండే వాళ్ళ కోసమేనా అన్నట్టు ఈ మధ్య ఒక కార్యక్రమం ప్రారంభమైంది. పుస్తక పఠనం, పుస్తకాలు చదవటం మృగ్యమైపోయింది. దిన పత్రికలు చదవటమే బోర్ గా ఫీలవుతోంది ఇప్పటి తరం. సాంకేతిక విజ్ఞానం అమాంతంగా అందుబాటులోకి వచ్చాక పుస్తకాలు చదవటం అనేది మరుగున పడిపోయింది. ఇలాంటి సమయంలో “face the book” అనే కార్యక్రమం “భారత్ టుడే” అనే ఛానెల్ లో ప్రసారమవుతోంది. వివిధరకాల పుస్తకాలను పరిచయం చేయటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ఆయా పుస్తకాలలో ఉన్న విషయాలేంటో వివరిస్తూ.. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, IAS శిక్షకులు, రచయిత అయిన శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు వ్యాఖ్యానిస్తూ సమర్పిస్తున్న ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంది. ప్రముఖమైన, చారిత్రక నేపథ్యం కలిగిన, పురాణ సంబంధమైన, సాహిత్య సంబంధమైన, జీవన విధానాలు-శైలికి సంబంధించిన, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడగలిగిన, మంచి విజ్ఞానాన్ని అందించగల, అనేక రకాల పుస్తకాలు ఆంగ్లంలోనివి, తెలుగు భాష లోనివి సేకరించి వాటిని ఆసక్తిదాయకంగా, స్ఫూర్తి కలిగే విధంగా, ఆయా పుస్తకాలను చదవితే బాగుండు అనే ఆసక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం ఉంది.

“ఆంధ్రుల సాంఘిక చరిత్ర” అని సురవరం ప్రతాప రెడ్డి గారు రచించిన తెలుగు వారి చరిత్రకు సంబంధించిన విశేషాలు గల పుస్తకంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటి వరకూ అనేక పుస్తకాలను పరిచయం చేసింది. వాల్మీకి రామాయణం, కాళిదాసు కవిత్వం, గుఱ్ఱం జాషువా గారి ‘గబ్బిలం’ అద్భుతంగా వివరించారు. భిన్నమైన మనస్తత్వాలు, అభిరుచులు, అలవాట్లు కలిగిన భార్యా భర్తల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చి తీరతాయి. కానీ, వాటిని ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఎలా సర్దుబాట్లు చేసుకోవాలో చెప్పే పుస్తకం జాన్ గ్రే రచించిన “Men in Mars Women in Venus”, ” సక్సెస్ సాధించాలంటే పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకో, ఆర్గనైజేషన్ స్కిల్స్ నేర్చుకో, థింక్ బిగ్, థింక్ పాజిటివ్ లీ, విజువలైజ్ పాజిటివ్ లీ” అంటూ చెప్పే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రచించిన “HowTo get Rich” అనే పుస్తకం గురించి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కీ.శే. డా.సి.నారాయణరెడ్డి గారి “కర్పూర వసంత రాయలు” గురించి, ప్రపంచం గర్వించ దగ్గ భారతీయ గణిత మేధావి ‘రామానుజన్’ గురించి, శ్రీనివాస్ రచించిన “తెలంగాణ సాహిత్య వికాసం” గురించి, ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందించే రాబిన్ శర్మ రచనలు, ‘you can win’ అంటూ స్ఫూర్తిని నింపే శివ్ ఖేరా రచనల గురించి, “ఇండియన్ ఫిలాసఫీ తెలుసుకోవాలంటే ఈ ఒక్క పుస్తకం చాలు” అంటూ ‘విశ్వ దర్శనం’ పుస్తకం గురించి, “The Great Indian Treasure” అనే కొత్త తరం పుస్తకాలు… ఇలా ఎంతో ప్రయోజనకరమైన పుస్తకాలు పరిచయం చేస్తూ సాగిపోతున్న “face the book” కార్యక్రమం లాంటివి ప్రస్తుతం అవసరం.

పుస్తకం ఒక ఆయుధం లాంటిది. జీవితంలో యుద్ధం ఎలా చేయాలో చెబుతుంది. పుస్తకం చదివితే చరిత్ర ఏమిటో తెలుస్తుంది. సమాజమేంటో తెలుస్తుంది. మనిషి మనిషిగా ఎలా ఉండాలో తెలుపుతుంది. పుస్తకం మొత్తంగా మన ఆలోచనల్ని మారుస్తుంది అంటూ మనకి ఈ కార్యక్రమం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్న శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.

ప్రజలపై ప్రతికూల ప్రభావం కలిగించని ఈ “face the book” లాంటి కార్యక్రమాలు ఎక్కువ కాలం మనగలగాలి. ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి, అనుకరించాలి. ఇలా ఇంకా కొంగొత్త కార్యక్రమాలు రావాలని కోరుకుంటూ… సామాన్య గృహిణి.

~ ఫణి మాధవి కన్నోజు ~

Facebook Comments

Leave a Comment