ఎక్కడాలేని శిల్ప సంపద తెలంగాణ సొంతం..

తెలంగాణ రాష్ట్రంలో మరుగున పడిన కళలకు గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ప్రముఖ కవి, రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లులో అద్భుతమైన శిల్ప సంపద ఉదన్నారు. వరంగల్‌ అర్బన్ జిల్లాలో మైమ్ మధు నిర్వహిస్తున్న ఉత్థానం అనే మైమ్(ముఖాభినయ) శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనికెళ్ల హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…రామప్ప గుడి వంటి శిల్పాకళ సంపద ప్రపంచంలో మరెక్కడా లేదని కొనియాడారు. సాంస్కృతికంగా చెప్పుకోదగ్గ చరిత్ర లేని దేశాలు తమ దగ్గరున్న కొద్దిపాటి సంపదను అతిగొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రామప్ప, వెయ్యి స్థంభాల దేవాలయంలోని శిల్ప సంపదను చూస్తే తన్మయం కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ స్వతహాగా కవి.. కళలు, సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన వ్యక్తి కావడంతో రాష్ట్రంలో మరుగున పడిన కళల గుర్తింపుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.

అద్భుతమైన కట్టడాలు, శిల్పాల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా విస్తృతమైన ప్రచారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం తన వంతు సహకారం అందిస్తానని హమీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌కే పరిమితమైన కళా ప్రదర్శనలను రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ విస్తరింపచేసినట్టు తెలంగాణ సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ వెల్లడించారు. కళలకు, సాహిత్య పోషణకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్, కవి పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు పాల్గొన్నారు.

Facebook Comments

Leave a Comment