అక్షర సేద్యానికి అవార్డుల పంట: తెలుగు కవులకు సాహిత్య అకాడమీ అవార్డులు

కేంద్ర సాహిత్య అకాడమీ 2017 బాల, యువ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో బాలసాహిత్యంలో విశిష్ట సేవలకుగాను రచయిత, కవి వాసాల నరసయ్యకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించగా.. హైదరాబాద్‌కు చెందిన కవయిత్రి మెర్సీ మార్గరెట్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. బాల సాహిత్య పురస్కార్‌, సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు సంబంధించి 24 భాషల్లో 24 మందిని ఎంపిక చేసింది. రెండు విభాగాలకు గాను 38 మందిని ఎంపిక చేసింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మెట్‌పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో జన్మించిన నరసయ్య ఎనిమిదో తరగతి నుంచి సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నారు. పోస్ట్‌మాస్టర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నర్సయ్య… 1978లో ‘కర్షకుడా.. కార్మికుడా’ పేరుతో తొలి గేయ సంపుటిని తీనుకొచ్చారు. కథ, వ్యాసం, పొడుపుకథలు, గేయాల రూపంలో సుమారు 28 బాలసాహిత్య పుస్తకాలను రచించారు. మరో 8 వచన కవితా సంపుటిలను వెలువరించారు.

ఆయన రచనల్లో తపాల ఈడీ ఉద్యోగులు, చిరు తరగలు, ఈదేశం, తపాలా చార్జీలు, గమ్యం, సమాజానికి సంకెళ్లు ఆదరణ పొందాయి. అక్షర సేథ్యం చేయడం మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని బాలసాహితీవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2009 నుంచి వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.

ఇక మెర్సీ మార్గరెట్‌ రచించిన ‘‘మాటల మడుగు’’ కవిత్వానికి ఈ అవార్డు లభించింది. హైదరాబాద్ కాచిగూడలోని మహిళా కళాశాలలో సహయ ఆచార్యులుగా పని చేస్తున్నారు. నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో వాసాల నరసయ్య, మెర్సీ మార్గరెట్‌ ఈ అవార్డులను అందుకోనున్నారు. కాగా ఇన్నాళ్లు చేసిన అక్షర సేద్యానికి వీరిద్దరికి అవార్డుల పంట పండటంపై తెలుగు సాహీతి లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది.

Facebook Comments

Leave a Comment