సమాచార భద్రత ను కట్టుదిట్టం చేయడం ఎంతో ముఖ్యం


జి 20 దేశాలలో సమాచార భద్రతపై జపాన్ లో ఇటీవల జరిగిన సదస్సులో భారత్ తమ ప్రజల సమాచారాన్ని తమ గడ్డ మీదే భద్రపరచాలని, సమాచార బదిలీకి సంబంధించిన చర్చలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ టి వో ) పరిధిలో జరగాలని నొక్కి వక్కాణించడం హర్షదాయకమైన విషయం. మరొకవైపు అగ్రరాజ్యం డేటాను తరలించే హక్కులు తమ సంస్థలకే దాఖలు పరచాలని పట్టుబడడంతో సమాచార భద్రత ఎంత వరకు భద్రమన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. 2014-17 ల మధ్య ప్రపంచ వాణిజ్యంలో వస్తు సేవల వాటాతో ధీటుగా డేటా ప్రవాహ విలువ 2.3 లక్షల కోట్ల డాలర్లకు చేరడం, అంతర్జాతీయ వాణిజ్యం లో సమాచార సేవ ఎంత కీలక పాత్ర వహిస్తోందో ఇట్టే ఊహించవచ్చు.

పెరుగుతున్న సమాచార ప్రవాహ విలువను గ్రహించిన భారతదేశం డేటా స్థానీకరణకు ప్రాధాన్యమిచ్చి తమ పౌరుల డేటాను స్వదేశంలోనే భద్రపరచే ప్రాతిపదికలు తయారు చేస్తొంది. వీసా, మాస్టర్ కార్డు వంటి విదేశీ చెల్లింపుల సంస్థలు భారతీయ ఖాతాదారుల విషయాలను భారతీయ సర్వర్లలోనే భద్రపరచాలని, ఒకవేళ కార్డు సంస్థలు భారతీయ లావాదేవీలను విదేశాలలో ప్రాసెస్ చేస్తే, ఆ వివరాలను 24 గంటలలోగా భారతదేశానికి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంకు ఆయా సంస్థలను ఆదేశించడం శుభపరిణామం. ఈ కామర్స్ నిబంధనలను కట్టుదిట్టం చేసి, డేటా స్థిరీకరణ చేసి సైబర్ నేరగాళ్ళ జోరుకు ముక్కుతాడు వెయ్యాలని భారత దేశం నిర్ణయాన్ని అమెజాన్, గూగుల్, ఫిప్ కార్ట్, మస్టర్, విసా కార్డు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తోడుగా తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనల్ద్ ట్రంప్ ఓసక సదస్సులో స్వేచ్చా డేటా ప్రవాహం లో డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ బలపరుస్తుందని నొక్కి వక్కాణించడమే కాకుండా డేటా స్థిరీకరణకు పట్టుబడే దేశాలకు హెచ్ 1 బ్ వీసాలు 10-15 శాతం ఇస్తామని సంకేతాలు పంపడం మన దేశం లో సమాచార సేవా సంస్థలు ఇరుకున పడదం ఖాయమని నిపుణులు హెచ్చరించడం తో సంస్థలలో గుబులు మొదలయ్యింది.అమెరికన్ల ఆర్ధిక సమాచారం అథ్యధికంగా భరత్ లో ప్రోసెస్ అవడం, 2017-18 లో భారత సాంకేతిక పరిజ్ఞానం సేవలు 62 శాతం ఎగుమతులు,41 శాతం ఆర్ధిక సేవలు అమెరికాకే చేరడం ,ఇప్పుడు మీన సూత్రాన్ని అమెరికా అమలు చేయడం మొదలుపెడితే మన దేశ ఆర్ధిక రంగం , ఉద్యోగ భద్రత కుదేలవడం ఖాయమని మన ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

క్రెడిట్ కార్డు లావాదేవీలను ఒక్క భారత దేశం లో కేందీకృతం చెయ్యడానికి కుదరదని ఆయా కార్డు సంస్థలు, ఈ కామర్స్ సంస్థలు ఖచ్చితంగా చెప్పడం తో డేటా స్థానీకరణ సూత్రం ప్రశ్నార్ధకంగా మారింది. భారత్ మాత్రం తాము తీసుకున్న నిర్ణయానికి అనుగుణం గా పౌరుల సమాచార స్థిరీకరణ కొరకు జాతీయ డేటా నిర్వహణా కేంద్రం నెలకొల్పాలని ప్రణాళికలు సిద్ధం చేయడం మంచి చర్య.మన దేశంలో డేటా బేస్ లను సమన్వయం చెయ్యడానికి సమర్ధులైన నిపుణుల కొరత ఎక్కువగా వుండడం తో ప్రభుత్వ సంస్థల డిజటలీకరణ గాలిలో వుంచిన దీపం చందాన తయారయ్యింది. ఇన్ని సమస్యల సుడుగుండం లో సమాచార స్థానికరణ భద్రతకు కట్టుదిట్టమైన, కఠినతరమైన చట్టాలే శరణ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Facebook Comments

3,972 Comments on this Post