ప్రజారోగ్యం పట్ల పాలకులు శ్రద్ధ చూపాలి..!

Image Courtesy@euchc.org

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రజారోగ్యం పదిలంగా ఉండాలంటే నాణ్యతతో కూడిన వైద్యం అవసరం ఉంటుంది. మన దేశంలో కూడా ప్రజారోగ్యం కోసం ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ అహర్నిషలు కృషి చేస్తున్నట్లు పాలకులు పదేపదే చెపుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

మన పొరుగున ఉన్న భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలతో పోల్చినా మనం ఎంత వెనకబడి ఉన్నామో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అంతర్జాతీయ ఆరోగ్య అధ్యాయన సంస్థ గ్లోబల్ ఆఫ్ డిసీస్ నిర్వహించిన సర్వే ప్రకారం వైద్యం, నాణ్యత ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నదనే విషయంలో ప్రపంచదేశాల్లో కెల్లా మన దేశం 145వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో విడుదల చేసినా నివేదిక ప్రకారం అల్లోపతి వైద్యం చేసే వారిలో యాభై ఏడు శాతానికి పైగా ఎటువంటి విద్యార్హతలు లేవనే విషయం బయటపడింది. అలాగే వైద్యులుగా చెలామణి అవుతున్న వారిలో 18 శాతం మందికి మాత్రమే అర్హత ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అల్లోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్దా, యోగా విధానాల్లోని వైద్యులతో కలిపి మన దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం ఎనభై మంది మాత్రమే ఉన్నారు. వారిలో సంబంధిత పట్టా కలిగిన అర్హులు లక్షకు ముప్పై ఆరు మంది మాత్రమే ఉన్నారు. ప్రమాణా ప్రకారం వైద్యులు,రోగుల నిష్పత్తి ప్రతి వెయ్యి మంది రోగులకు ఒక డాక్టరు ఉండాలి. కానీ, మన దేశంలో లక్షా పదిహేను వేల మందికి ఒక డాక్టరు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఏ కోణంలో చూసినా జనాభాకు అవసరం మేరకు డాక్టర్లు లేరనేది ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

కేంద్ర,రాష్ట్ర పాలకులు ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరం మేరకు నిధులు కేటాయించి వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

Facebook Comments

Leave a Comment