రాజ్యాంగబద్ధ పాలనకే రాజకీయ గ్రహణం..!

పార్లమెంటరీ ప్రజాస్వామ్యమనే నాగరిక పాలన సంవిధానంలో చట్టసభ సభ్యులెవరూ లాభదాయక పదవులు చేపట్టరాదని రాజ్యాంగ నిర్మాతలు లక్ష్మణ్ రేఖలు గీశారు. మంచుకు వేసిన పందిళ్ళు వడగళ్ళను ఆపలేవని నిర్దారిస్తూ అవినీతి భ్రష్టత్వంలో ఏటికేడు కొత్తలోతులు ముట్టడంలో రాటుతేలిన నేతలెందరో ప్రజాప్రాతినిధ్యాలను లాభదాయకంగా మార్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. సామాజిక వనరుల పంపిణీ విశాల జనహితకంగా సాగాలని, సంపద ఏ కొద్ది మంది చెంతో పోగుపడదని విధంగా ఆర్ధిక వ్యవస్థ నడకకు భరోసా ఇవ్వాలని రాజ్యాంగంలోని 38, 39 అధికరణలు చెబుతున్నా, వాటి స్పూర్తికి చెల్లుకొట్టి అధికార పీఠాల దన్నుతో లక్షల కోట్ల రూపాయల జనధన దోపిడీస్వామ్యానికి తెరతీస్తున్నారు.

చట్టసభల సభ్యులు, వారి సంబంధీకుల ఆదాయ మార్గాల నుంచి అందే మొత్తానికి, వాస్తవంగా పోగుపడ్డ ఆస్తులకు పొంతన లేదంటే, రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేసినట్లే భావించాలి. గతేడాది ఫిబ్రవరి నాటి చరిత్రాత్మక తీర్పులో ద్విసభ్య బెంచ్ చేసిన వ్యాఖ్య అది. ప్రధాన వ్యాజ్యం దాఖలు చేసినపుడు లొక్ ప్రహారీ సంస్థ 26మంది లోక్ సభ, 12మంది రాజ్యసభ సభ్యులతో పాటు 258మంది శాసనసభ్యుల ఆస్తులు 2009తో పోలిస్తే, 2014లో లెక్కకు మిక్కిలిగా పెరిగిన వైనాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం నివేదిక ఆధారంగా కోర్టుకు సమర్పించింది. వాటిని పరిశీలించాలని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించినా, అది సక్రమంగా స్పందించకపోవడంపై ఆగ్రహించిన న్యాయపాలిక, రాజ్యాంగ రూపశిల్పుల ఆదర్శాలకు గొడుగుపడుతూ, ఆదాయానికి మించి ఆస్తులు పోగేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి తీరాలని తీర్పులో స్పష్టీకరించింది. ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్ధుల ఆదాయాల్లో అసహజ పెరుగుదలను పసిగట్టే శాశ్వత యంత్రాంగం ఏర్పాటుపై ఏం చేశారో రెండు వారాల్లోగా నివేదించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.

అభ్యర్ధులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడ్డ వారి ఆదాయాలు, ఆదాయ మార్గాలను ఎన్నికల వేళ తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనావళి ఎందుకు సవరించలేదన్నా న్యాయపాలిక సూటి ప్రశ్నలో కోట్లాది మంది ధర్మాగ్రహం ప్రతిధ్వనిస్తోంది. కేసులే, సూట్ కేసులే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్ధుల ప్రధాన అనర్హతలుగా పార్టీలు పరిగణిస్తుండటంతో రాజ్యాంగబద్ధ పాలనకే రాజకీయ గ్రహణం పట్టింది.

Facebook Comments

Leave a Comment