నీటి పారుదల ప్రోజెక్టులను వేగవంతం చేయాలి

Photo Courtesy: The Hans India

భారతదేశంలో ప్రాజెక్టులలో జాప్యం సర్వసాధారణమైపోయింది.. ఆలశ్యం కారణం ప్రోజెక్టుల అంచనాలు, వ్యయం ఎక్కువైపోయి అంతిమంగా ఆ భారం అంతా ప్రజలపై పన్నుల రూపం లో పడుతుంది. గత దశాబ్ద కాలం లో దేశం లో వివిధ ప్రోజెక్టుల వ్యయం డి పి ఆర్ లోని అంచనాల కంటే సగటున 22 శాతం పెప్రిగి వేల కోట్ల భారం ప్రభుత్వం పై, ప్రజాధనం పై పడిందని కాగ్ తాజా నివేదిక ప్రోజెక్టుల నిర్మాణం లో ప్రభుత్వాల, ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ ల అలసత్వాన్ని తేటతెల్లం చేస్తోంది.

అనుకున్నది అనుకున్న సమయంలో అమలు జరగకపోయినట్లయితే ఫలితంగా విపరిణామాలు చోటు చేసుకొంటాయి. అదేవిధంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయానికొస్తే అనుకున్న సమయంలో పూర్తికానట్లయితే వ్యయం విపరీతంగా పెరిగిపోవడమేగాక వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది.. సాగునీటి ప్రోజెక్టుల ఆలస్యం వలన గత దశాబ్ద కాలంలో సాగు నీరు లభించక వ్యవసాయ రంగం లో 11 శాతం ఉత్పాదకత తగ్గినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. యూపీఏ-2 (2009-2014 ) సమయంలో వివిధ అనుమతులు మంజూరు చెయ్యకపోవడం, లైసెన్స్ రాజ్యం విశృంఖలంగా రాజ్యమేలడం వంటి కారణాల వలన రూ. 21 లక్షల కోట్ల ప్రాజెక్టులు, వాటిలో ఎక్కువగా మౌలిక సౌకర్యాల పథకాలు పెండింగ్‌లో పడిపోయాయి. దేశం లో ప్రోజెక్టుల నిర్మాణం విషయం లో జరుగుతున్న తీవ్ర జాప్యం పై ప్రపంచ బ్యాంకు, ఐ ఎం ఎఫ్, ప్రపంచ ఆర్ధిక సమన్వయ సంస్థ వంటి సంస్థలు తీవ్ర ఆందోళన వెల్లిబుచ్చడం తో పాటు, పరిస్థితిలో సత్వరం మార్పు రాకపోతే ఋణాల మంజూరును ఆపివేస్తామని తీవ్రం గా హెచ్చరించాయి. దాంతో ఆ ప్రభుత్వ పదవీకాలం చివరిదశలో వివిధ వర్గాల నుండి వచ్చిన ఒత్తిళ్ళ కారణం గా ఒక మంత్రిత్వ కమిటీని నెలకొల్పవలసి వచ్చింది. జాప్యాన్ని అరికట్టడానికి, కనీసం దేశంలోని వ్యవసాయరంగం, రైతులపై దుష్ప్రభావం పడకుండా చూసేందుకు ఇరిగేషన్‌ ప్రాజెక్టులనైనా వేగవంతం చేయడానికి ‘యాక్సిలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం (ఏఐబీపీ)గా పిలువబడే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 వ సంవత్సరం లో అట్టహాసం గా ప్రారంభించింది. అయితే ఈ పధకం అమలులో లొసుగుల కారణం గా క్షేత్ర స్థాయిలో ఎలాంటి సత్ఫలితాలనివ్వలేదు.

పైపెచ్చు 2008-2017 మధ్యకాలంలో 25 రాష్ట్రాల్లో ఏఐబీపీ కింద ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లో అసాధారణ జాప్యం జరిగినట్లు, నిధుల మళ్లింపు, ఆర్థిక అవకతవకలు వంటి తీవ్ర తప్పిదాలు జరిగినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నిర్వహించిన నిర్వహణ ఆడిట్‌ దిగ్భ్రాంతిగొలిపే విధంగా వెల్లడించింది. సదరు నివేదికలో అసాధారణ తప్పిదాలు, జాప్యాలు, ఉద్దేశపూర్వక జాప్యం వలన ప్రోజెక్టు వ్యయం ఎలా పెరిగిందో కళ్ళకు కట్టినట్లు వివరించింది.

రూ. 2.39 లక్షల కోట్లతో 2008-2017 మధ్యకాలంలో 211 భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టబడ్డాయని, వాటిలో 119 ప్రాజెక్టుల విషయంలో 18 సంవత్సరాల జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ. 1.65 లక్షల కోట్లు అదనంగా పెరిగినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. నిధులు విడుదల చేయకపోవడం లేదా స్వల్పంగా విడుదల చేసిన ఘటనలుండటంతో ఏఐబీపీ ఆర్థిక నిర్వహణ అసమర్థంగా వుందని కాగ్‌ పేర్కొంది. భూసేకరణ కొరత, ముందుగా చట్టబద్ధ అనుమతి పొందలేకపోవటం, డిజైను మార్పు చేయటం వగైరాల వల్ల కూడా ప్రాజెక్టులు పూర్తికావడంలో జాప్యానికి కారణం. కేంద్ర జలవనరుల కమిషన్‌ (సీడబ్లూసీ) నివేదికలు పెండింగ్‌లో వుండటం, అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పడకపోవడం వల్ల కూడా ప్రాజెక్టుల పూర్తిలో జాప్యం జరుగుతోంది. పధకాల అమలులో నెలకొన్న అలసత్వం తో పాటు భారీ అవినీతిపై కూడా సదరు నివేదిక దృష్టి సారించింది. పభుత్వం, నియంత్రణ, పర్యవేక్షణ సంస్థల నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరి, కట్టుదిట్టమైన నాణ్యతా ప్రమాణాల ఆడిట్లు లేకపోవడం కూడా కొన్ని కారణాలని చెప్పవచ్చు. కొన్ని ప్రోజెక్టులలో లోపభూయిష్టమైన డిజైన్ల కారణంగా వ్యయం 1245 శాతం పెరిగిన దృష్టాంతాలు ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి.భారతీయ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయకుండా నీటి పారుదల ప్రాజెక్టులు ప్రణాళికబద్ధంగా వ్యయం అంచనాల లోపే పూర్తిచేసి వ్యవసాయాన్ని, రైతన్నలను ఆదుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయవలసిన అవసరముంది

Facebook Comments

Leave a Comment