చట్టసభలకు సచ్చీలురనే ఎన్నుకోవాలి.

Image Courtesy: The Fresh Quotes

సచ్ఛీలురు, సత్యనిష్ఠా గరిష్ఠులు ఉన్నత పీఠాల్ని అధిష్ఠిస్తే రాజ్యాంగ వ్యవస్థలు సమర్ధవంతం గా పనిచేసి దేశం అభివృద్ధిబాటలో పయనిస్తుందన్నది మన రాజ్యాంగ నిర్మాతల స్పూర్తి. కాని నేడు దేశంలో ఆ స్పూర్తి కొరవడుతోందని పలువురు రాజ్యంగ నిపుణులు, అమార్త్యసేన్ వంటి సామాజిక విశ్లెషకులు వాపోతున్నారు. ఒక్కప్పుడు విద్యావేత్తలు, సామాజికవేత్తలు, సమాజ సేవలో జీవితం గడుపుతున్న వారు మరింత మెరుగైన ప్రజాసేవ కోసం రాజకీయాలలోనికి వచ్చేవారు. అందుకే కొంతమంది రాజకీయ వేత్తలను ఇప్పటికీ స్మరించుకుంటూ వున్నాం. కాని కాలక్రమేణా పరిస్థితులు మారాయి.

వ్యాపారవేత్తలు, కోర్పొరేట్ సంస్థల అధిపతులు, కోట్లకు పడగలెత్తినవారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు రాజకీయాలను ఒక సాధనంగా వాడుకోవడం మొదలుపెట్టారు. వారితో పాటు మచ్చరితులు, నేర చరిత్ర వున్నవారు, హత్యలు, దోపిడీలు, కిడ్నాపింగ్ లకు పాల్పడినవారు సైతం రాజకీయాలలోనికి రావడం మొదలుపెట్టారు. గెలుపు గుర్రాల పేరిట అన్ని రాజకీయ పార్టీలు వారికే పార్టీ కండువాలు కప్పి టిక్కట్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. దానితో మొత్తం రాజకీయ వ్యవస్థే భ్త్రష్టు పట్టి పట్టిపోయింది. రాజకీయ అవినీతి ఎన్నడూ లేనంతగా వేలకోట్లకు పెరిగిపోయింది. అక్రమంగా సంపాదించిన డబ్బును ఓట్ల కొనుగోలుకు వాడుతున్నారు. దానితో ఎన్నికలంటే ధనమయం, మందుమయం అయిపోయింది. చట్టసభల ప్రతినిధులుగా ఎన్నికవుతున్న నేతల్లో పలువురు అవినీతి, ఆశ్రితపక్షపాతం, అక్రమాలకు తెగబడి రాజకీయ విలువలకు నిలువెత్తు సమాధి కడుతున్న తీరు బాధాకరం. తమ గెలుపు కోసం కులం, మతం, ప్రాంతం తదితర విద్వేషాలను రెచ్చగొట్టి సమాజాన్ని అడ్డగోలుగా చీల్చివేస్తున్నారు. ఫలితంగా సమాజం లో అసహనం, విద్వేషాగ్నులు పెచ్చురిల్లితున్నాయి. డబ్బు, మద్యం ఎరజూపి ఓట్లను అంగట్లో సరకుగా కొనుగోలు చేస్తున్నారు. ఓటుకు నోటు అనేది గెలుపుకు మంత్రం గా మారిపోయింది. ఎప్పటిలానే ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికలు కండబలం, ధనబలం, అధికార బలం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ మొత్తం మోతలో సామాన్యుడు బలి ఇచ్చే జంతువులా తయారవుతున్నాడు.

ఒక్క ఫిరాయింపుల విషయంలో మాత్రమే కాదు… సభా నిర్వహణలో సైతం స్పీకర్ల వ్యవహార శైలి పాలకపక్షానికి అనుకూలంగా ఉంటున్నది. సభాధ్యక్ష స్థానంలో ఉండేవారే సక్రమంగా లేనప్పుడు సభ్యుల ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండదు. మొత్తంగా చట్టసభలు భ్రష్టుపడుతున్నాయి. ప్రజల్లో వాటిపట్ల విశ్వసనీయత తగ్గడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సమగ్రమైన ప్రవర్తనా నియమావళి రూపొందించుకుంటే ఈ విశ్వసనీయత పెంచవచ్చునన్నది పలువురి అభిప్రాయం. కానీ పాలక పార్టీలే ఈ స్థితికి కారణమై, దాని వల్ల లబ్ధి పొందుతున్న దశలో ఏకాభిప్రాయం ఎండమావే అవుతుంది. కనుకనే ఫిరాయింపు చట్టానికి సమగ్రమైన సవరణలు అవసరం. నిర్దిష్టమైన నిబంధనలుంటే దాన్నుంచి తప్పించు తిర గటం అసాధ్యమవుతుంది. ఆ దిశగా ప్రయత్నించినప్పుడే చట్టసభలపైనా, ఎన్నికలపైనా, ప్రభుత్వాలపైనా ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది.

చట్ట సభలలో ప్రజల సమస్యలను సమగ్రంగా చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించే పద్ధతికి నేటి నేతలు నిలువునా పాతరేసారు. అతి ముఖ్యమైన బిల్లులను ఆర్డినెన్స్ ల రూపం లో అడ్డదారిన తీసుకువచ్చేస్తున్నారు. మరి కొన్ని ముఖ్యమైన బిల్లులపై తు తు మంత్రం చందాన చర్చలు జరిపి ఆమోదం ఇచ్చేస్తున్నారు. ప్రజాస్వామ్యమంటే నేటి రాజకీయ పార్టీలకు ఒక అపహాస్యం అవుతొంది. చట్టసభలలో సంఖ్యా బలం తో అర్ధవంతమ్మైన చర్చలు జరగకుండానే నిర్ణయాలను తీసుకుంటున్నాయి. అందుకే ఈ ఎన్నికలలో ఎటువంంటి ప్రలోభాలకు లొంగకుండా, ఓటు అనే వజ్రాయుధం ద్వారా సచ్చీలురను, సమర్ధులనే చట్ట సభలకు ఎన్నుకునే విధం గా ప్రజలు మరింత క్రియాశీలకంగా, అప్రమత్తం గా వ్యవహరించాలి

Facebook Comments

Leave a Comment