ముంచుకొస్తున్న జలసంక్షోభం ముప్పుపై అప్రమత్తత అవసరం

Photo Courtesy: Rediff

జలమే జీవనాధారం మరియు జీవాధారం అన్నది నానుడి, కానీ మన దేశం లో మంచి నీటి సంక్షోభం రోజు రోజుకూ తీవ్రతరం అవడం, రానున్న కాలంలో త్రాగడానికి గుక్కెడు

నీళ్ళు దొరుకుతాయా అన్న ప్రశ్నకు కాదు అనే సమాధానం వస్తుంది. 2040 వ సంవత్సరానికల్లా త్రాగు నీటికి తీవ్ర కరువు ఏర్పడుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాలు కొన్ని కోట్ల మంది ఆవాసముంటున్న మన దేశం లో త్రాగు నీరందించడానికి పెను భారాన్ని మోయలేక మోస్తున్నాయి.

ప్రపంచ బ్యాంకు వెలువరించిన నివేదికలో ప్రపంచ జనాభాలో 18 శాతం కలిగి వున్న భారత్ జల వనరులలో నాలుగు శాతం మాత్రమే వుందని, 133 మంది కోట్ల భారతీయులలో 78 శాతం మందికి భారత ప్రభుత్వం సరైన త్రాగు నీరు అందించలేకపోతొందని చేదు నిజాలు వెల్లడించింది. వర్షా భావం, సరైన ప్రణాళికలు లేకపోవడం, రోజు రోజుకూ అనూహ్యం గా పెరిగిపోతున్న జనాభా, జల సంరక్షణ పట్ల బాధ్యతా రాహిత్యం తో నీటి వనరులను ఎడా పెడా వాడెయ్యడం,పట్టణాలలో ఒక నియంత్రణా అనేది లేకుండా భూగర్భ జలాలను ఇష్టా రాజ్యం గా తోడేయ్యడం, వాల్టా చట్టానికి తూట్లు పొడిచి అడుగు అడుగుకూ బోర్లను వేసెయ్యడం వలన నీటి ఎద్దడి సమస్య ఎక్కువౌతొంది. పర్యావరణ, అడవులను విచక్షణా రహితంగా నరికెయ్యడం, అభివృద్ధి పేరిట పచ్చదన్నాని హరించి వెయ్యడం వలన వాతావరణం లో అనూహ్యమైన మార్పులు సంభవించి సరిగ్గా వర్షాలు పడడం లేదు. తత్ఫలితం గా ఉపరితల జల వనరులు అయిన నదులు, చెరువులు ఎండిపోవడం తో ప్రజలు త్రాగునీటి కోసం భూగర్భ జలాలను ఆశ్రయించి ఎడా పెడా తోడెయ్యడం తో అవి కుడా అడుగంటిపోయే ప్రమాదకర పరిస్థితులు రావడం నిస్స్సందేహం గా మానవ తప్పిదమే అని చెప్పవచ్చు. వ్యవసాయ ప్రధానమైన మన దేశం లో దాదాపు అరవై కోట్ల మంది రుతు పవనాల మీద ఆధారపడ్డారు. సమయానికి వర్షాలు పడకపోవడం, నీటిని పొదుపుగా వాడుకొని గరిష్ట దిగుబడులను సాధించడం ఎలాగో తెలియకపోవడం, భూగర్భ జలవనరులు అడుగంటిపోవడం తో నీటి కొరత తీవ్రంగా పెరిగి సరిగ్గా పంటలు పండక, అప్పులు చేసి, అప్పటికే చేసినవి తీర్చలేక, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరం. గోరు చుట్టుపై రోకలిపోటులా పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో జలవనరులు కలుషితమై ఉపయోగానికి పనికి రాకుండా పోవడం, కాలుష్య మండలి ఎటువంటి నియంత్రణా చర్యలు తీసుకోకపోవడంతొ, ఎంతో విలువైన మంచి నీరు వ్యర్ధమైపోతొంది. మన దేశంలో వున్న విద్యుత్ ఉత్పాదన చేస్తున్న 400 ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో 40 శాతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనితో విద్యుత్ ఉత్పాదనకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. 2030 సంవత్సరాని కల్లా 40 శాతం విద్యుత్ ను సౌర, పవన విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పాదన చేస్తామని, దాని ద్వారా వాయు నీటి కాలుష్యాన్ని అధిగమిస్తామన్న ప్రభుత్వ ఆశయాలు మాటలకే పరిమితమవడం దురదృష్టకరం.

మన దేశం లో విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడెయ్యడం తో భూగర్భ జల నీటి మట్టాలు అసాధారణ స్థాయికి పడిపోవడం తో కొన్ని రాష్ట్రాలలో ప్రజలు త్రాగునీటి కోసం మైళ్ళ దూరం నడిచి తెచ్చుకునే దురదృష్టకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ప్రభుత్వాలలో చలనం కనిపించకపోవడం ప్రజల దౌర్భాగ్యం. మన దేశం లో ప్రభుత్వాల అలసత్వం, ప్రజలలో జల వనరుల సంరక్షణ పట్ల బాధ్యత, జవాబుదారీతనం లోపించడం, నదులను, చెరువులను కలుషితం చేయడం లో ప్రధాఅన పాత్ర వహిస్తున్న కార్పొరేట్, పారిశ్రామిక వ్యవస్థలపై క్రమశిక్షణా చార్యలు తీసుకోకపోవడం తో మానవాళికి అచిరకాలం లోనే జల ముప్పు ఏర్పడే ప్రమాదం ఏర్పడింది.

Facebook Comments

Leave a Comment