త్రికరణశుద్ధిగా మాదకద్రవ్యాల నిర్మూలనకు పాటుపడాలి

మత్తుపదార్ధాలు, మద్యపానం వినియోగంతో పాటు ధూమపానం కూడా సమస్త మానవజాతిని పట్టిపీడిస్తొన్న పిశాచిలుగా చెప్పవచ్చు. ధూమపానం విషయంలో ప్రభుత్వం కొంత మేరకు చర్యలు తీసుకుంటున్నా అవి ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగించడం లేదు. ఇక మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మద్యాదాయమే మహాప్రసాదంగా భావించి ప్రభుత్వమే ప్రోత్సహించి ప్రజలను తాగుడువైపు నడిపిస్తోంది.

మద్యం ద్వారా ఆదాయం రాకపోతే అసలు ప్రభుత్వమే నడవదనే పరిస్థితికి చేరుకున్నామని చెప్పవచ్చు. ఇక ఈ మాదకద్రవ్యాల విషయంలో ప్రభుత్వం కఠినమైన చట్టాలే చేసి చర్యలు తీసుకుంటున్నా ఏ మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. దీంతో ఈ మాదకద్రవ్యాల మత్తులో వారు ఏం పనులు చేస్తున్నారో కూడా వారికే తెలియని పరిస్థితుల్లో చేయరాని, చేయకూడని పనులకు పాల్పడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మాదకద్రవ్యాల నేరాల విభాగం లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మత్తుమందు వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఇండియాకి సంబంధించి మత్తుబానిసలు దాదాపు 15కోట్లకు పైగానే ఉండవచ్చని అంచనా. గల్ఫ్ లోని ఒమెన్ లో సాగు ఆదిలో ఎనిమిది ఎకరాల్లో ఖట్ అనే మాదకద్రవ్యం మొక్క నేడు దాదాపు అరవై లక్షల ఎకరాలకు పెరిగిపోయింది. అంతర్జాతీయంగా పరిశీలిస్తే ఒక్క హెరాయిన్ వాడకం దాదాపు ఐదు వందల టన్నులకు మించిందని మాదకద్రవ్య అధ్యయన నివేదిక వరల్డ్ డ్రగ్ రిపోర్టు వెల్లడించింది. ప్రపంచంలో అనేక దేశాలతో పాటు ఇటు తెలంగాణ,అటు ఆంధ్రప్రదేశ్ లో మారుమూల అటవీ ప్రాంతాల్లో సైతం మాదకద్రవ్యాల ముఠాలు ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయి. గంజాయి సాగు అంతకంతకూ విస్తరిస్తున్నదనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశం,పంజాబ్,హర్యానా తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మారుతున్న జీవనవిధానం,అధిక మొత్తాల్లో లభించే ఆదాయం యువతను ఆ దిశగా నడిపిస్తున్నది. హైదరాబాదు నగర శివార్లలో పారిశ్రామిక వాడల్లోకి వ్యాపించిన ఈ దుస్సంస్కృతి యావత్ జాతి భవితనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. నగరాలు, పట్టణాలు పిల్లలను మాదకద్రవ్యాల మాఫియా ముఠా లక్ష్యంగా చేసుకొని ఒక వ్యూహం ప్రకారం ఆ వుచ్చులోకి దించడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకుంటున్నారని ప్రణాళిక సంఘం అధ్యయన బృందం స్పష్టం చేసింది. నైజీరియన్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నా కోట్లాది రూపాయల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేస్తున్నా, ఈ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. మాదకద్రవ్యాల సవాల్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనవలసిన సమయమిదే. దీనిని పూర్తిగా ప్రభుత్వం పైనే బాధ్యతగా వదిలిపెట్టకుండా స్వచ్చంద సంస్థలు,పౌరులు,అందరూ కలిసికట్టుగా త్రికరణశుద్ధిగా మాదకద్రవ్యాల నిర్మూలనలో పాటుపడాలి.

Facebook Comments

Leave a Comment