వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించాలి..!

వ్యవసాయరంగంలో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుండగా ఆదాయాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం తీసుకున్న చర్యలు తాత్కాలికంగా కొంత మేరకు ఉపశమనం కలిగించేవే తప్ప రైతులను ఏ మాత్రం ఉద్దరించేవి కావని కేంద్ర గణాంక కార్యాలయం నివేదికను బట్టి స్పష్టమవుతోంది. వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు సంస్థలు,మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా ప్రభుత్వం పకడ్భందీ కార్యాచరణతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలతో పాటు పప్పుగింజల సాగు విస్తీర్ణం కానీ,దిగుబడి కానీ పెద్దగా పెరగలేదు. అయినా పంటల విలువ తగ్గిపోవడం గమనించాల్సిన అవసరం ఉంది. మరో వైపు హెక్టారుకు, క్వింటాకు ఎరువులు, విత్తనాలు తదితరాల ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. వ్యవసాయ ఖర్చులు, జీవన వ్యయం పెరుగుతున్న మేరకు పంట ధరలు పెరగటం లేదు. ఫలితంగా ఆదాయాలు పడిపోతున్నాయి. గ్రామీణ, పట్టణ కుటుంబాలు పిల్లల చదువు సంధ్యలపై ఏటా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ, ఆ మేరకు ఆదాయాలు పెరగటం లేదు. పంటల విలువలు పెరిగినపుడు గ్రామీణుల కొనుగోలు శక్తి పెరుగుతోంది. అది యావత్ ఆర్ధిక వ్యవస్థను వృద్ధి పథంలో పయనింపజేస్తుంది. లేదంటే అది తన సత్తాకు తగిన వృద్ధి రేట్లను సాధించగలదు. ప్రస్తుతం అత్యధిక గ్రామీణులకు వ్యవసాయం తప్ప ఇతర అనుబంధ కార్యకలాపాల్లో రాబడి వచ్చే అవకాశం లేదు. భారీ పెట్టుబడులు అవసరమయ్యే చేపలు,రొయ్యల పెంపకం, పాడి వంటి అనుబంధ కార్యకలాపాల నుంచి మాత్రమే రైతులకు అధిక విలువ, ఆదాయాలు లభించాయి. దేశమంతటా కౌలు రైతుల సంఖ్య పెరిగిన దృష్ట్యా వారిలో ఎంత మంది ఇంత భారీ పెట్టుబడులు తీసుకురాగలరనేది సందేహమే. సొంత ఆస్తులు లేని కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఫలితంగా వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. పప్పు, నూనె గింజల సాగు కన్నా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు ఎక్కువ నీరు కావాలి. ప్రస్తుతం భూతాపం వల్ల కొన్ని చోట్ల అతివృష్టి సర్వసాధారణమైపోతున్నాయి. సంవత్సరంలో కొన్ని నెలలపాటు కురవాల్సిన వర్షపాతం కొన్ని రోజుల్లోనే కురుస్తోంది. ఈ స్థితిలో చేపలు, రొయ్యల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం వివేకమనిపించుకొంటుందా. మారిన వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయానికి కావాల్సిన నీటిని ఒడిసిపట్టి నిల్వచేయడమూ సమస్యాత్మకమవుతోంది. నీటిని వృథా చేస్తున్న వ్యవసాయ రంగం దాన్ని సమర్ధంగా,పొదుపుగా వాడి ఎక్కువ ఫలం సాధించాలి. పాలు,మాంసం,చేపలు,రొయ్యల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను పెద్ద ఎత్తున వ్యాపింపజేయాలంటే అధిక నీటితో పాటు శీతల గిడ్డంగులు, రవాణా వంటి మౌళిక వసతులను విరివిగా విస్తరింపజేయాలి. అప్పుడే అన్నదాతకు ఒకింత మేలు జరిగే అవకాశం ఉంటుంది.

Facebook Comments

Leave a Comment