రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం అవసరం..!

Image Courtesy: LANTERIA/Shutterstock

ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలను రాజకీయాల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానీ, మన రాజకీయ పార్టీలు ఆ మేరకు అవకాశాలు లభించడం లేదు. చట్టసభల్లోకి ప్రవేశించేందుకు మహిళలకు టికెట్లు ఇచ్చే విషయంలో అన్ని పార్టీలు దాదాపుగా ఒకే మార్గంలో పోతున్నాయి. అతి కష్టం మీద ఓ పది, పదిహేను స్థానాలు కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్నాయి.

ప్రతి పార్టీ పేరు కోసం మాత్రమే మహిళల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నాయి. వారికి సముచిత స్థానం కల్పిస్తామని వివిధ సందర్భాల్లో నాయకులు వేదికలపై హామీల జల్లు కురిపిస్తున్నప్పటికీ అవి ఆచరణలో ఏ మాత్రం సాధ్యపడటం లేదని చెప్పవచ్చు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించాక మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ వారికి సమున్నత స్థానాన్ని కట్టబెట్టింది. అంతటితోనే మహిళా ప్రగతి ఆగిపోయింది. తరువాతి రోజుల్లో పార్టీలు, ప్రభుత్వాలు వారికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యంపై చాలా ఆలస్యంగా అడుగులు పడ్డాయి. 2017 లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన మహిళా శాసనసభ్యుల సంఖ్య సైతం పరిమితంగానే ఉంది. ఉత్తరప్రదేశ్ లో నాలుగు వందలకు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ, 41చోట్ల మాత్రమే మహిళలు విజయం సాధించారు. పంజాబులో 117 స్థానాలకు గాను ఆరు స్థానాల్లోనే విజేతలుగా నిలిచారు. ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు గాను కేవలం 4 స్థానాల్లోనే మహిళలు నెగ్గారు. వీటిని చూస్తే మహిళా ప్రాధాన్యం ఎంత తక్కువగా ఉందో అన్న విషయాన్ని ఈ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. పార్టీలు మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించలేకపోతున్నాయన్నది వాస్తవం. పురుషులకు సమానంగా కాకపోయినప్పటికీ కనీసం 33 శాతమైనా ఇవ్వడం లేదనేది నమ్మలేని నిజం. పార్టీల పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతం చేసే బాధ్యత మహిళా కార్యకర్తలు తమ భుజస్కందాలపై వేసుకుంటారు. ఎన్నికల సమయంలో మాత్రం నాయకులు వారి కళ్ళకు గంతలు కట్టి వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి.

ప్రజలతో మమేకమై అలుపెరగని పోరాటాలు చేస్తూ క్రియాశీలంగా ఉన్న మహిళలకు పార్టీల్లో సరైన స్థానం లభించడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో మహిళల కోసం ఘనంగా వరాలు ప్రకటిస్తున్నాయి. అంతే తప్ప వారికి కేటాయించే స్థానాల విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదు. ఆ దిశగా అడుగులు వేస్తేనే సిసలైన మహిళా సాధికారతకు మార్గం సుగమం అవుతుంది.

Facebook Comments

Leave a Comment