ఉష్ణతాపం లో విలవిల్లాడుతున్న భోగోళం

Graphic Courtesy: Cartophilia

గత కొన్ని వారాలుగా మన దేశం లో ఉష్ణ తాపం గణనీయం గా పెరిగిపోయింది. వర్ష పాతం అనూహ్యంగా వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా తగ్గిపోయింది. ప్రజలు వర్షాకాలం కూడా ఎండా కాలాన్ని తలపించడం తో ప్రజలు ఎండలు భరించలేక మల మల మాడిపోతున్నారు.భూ ఉష్ణోగ్రత 1.5 సెల్సియస్ డిగ్రీలకు మించకూడదని పర్యావరణ శాశ్త్రవేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నా వాటిని పెడచెవిన పెట్టడం ఈ భూతాపానికి ప్రధాన కారణం. వారావరణ అసమతుల్యతకు అధిక భాగం మానవ తప్పిదమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రకృతి సమతుల్యానికి కావల్సిన అనుకూల పరిస్థితులు లేకపోవడం తో ఉష్ణతాపం పరిధులకు మించి పెరిగిపోతోంది. అడవుల నరికివేత, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, మైదాన ప్రాంతాలలో చెట్లు లేకపోవడం, అభివృద్ధి పేరిట ఉన్న చెట్లను నరికివేయడం, పరిశ్రమల మరియు వాహన కాలుష్యం ప్రకృతి అసమతుల్యానికి కారణమౌతోంది. మానవుడు అభివృద్ధి పేరిట ప్రకృతిని సవాలు చేస్తే, దానికి ప్రతిగా ప్రకృతి కన్నెర్ర చేస్తే పరిణామాలు ఏ విధం గా వుంటాయో ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. బహుళ అంతస్థులు నిర్మించి వాటిలో ప్రజల నీటి అవసరాల కోసం భూమిని ఇష్టారాజ్యం గా తవ్వి ఒక బోరు సరిపోకపోతే అదనం గా అదే ప్రాంగణం లో మరి రెండు బోర్లు జోడిస్తూ భూగర్భ జల సమతుల్యతని అస్తవ్యస్తం చేయడం ఎంతవరకు సబబో మానవులు ఆలోచించుకోవాలి. అభివృద్ధి పేరిట హరితదనాన్ని హరియించి, తన ఉనికికే ముప్పు తెచ్చుకోవడం కూర్చున్న కొమ్మను నరుకున్న చందమని ఇప్పటికైనా తెలుసుకోవడం మంచిది. వాతావరణం లో సున్నితత్వం లోపించడం, కార్బన ఉద్గారాల తీవ్రత పెరిగిపోయి, 80 కోట్ల ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతొందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యలు కొరవడడం బాధాకరం. ఈ ఉష్ణ తీవ్రతతో 1997-2017 మధ్య కాలం లో సముద్ర మట్టాలు అనూహ్యం గా 3.3 మిల్లీమీటర్లు పెరిగి అందువలన వరదలు, సునామీలు సంభవీంచి సముద్ర జలాలు ప్రపంచవ్యాప్తం గా జనవాసాలలోనికి చొచ్చుకురావడం, మంచు ఖండాలు కరుగుతుండడం, అందువలన జీవ నదులు ఎండిపోయి, పంటలకు సేద్యపు నీరు, ప్రజలకు త్రాగు నీరు లంభించడం దుర్లభమౌతోంది. మేఘాల కదలికలు లేకపోవడం తో హఠాత్తుగా కారు మేఘాలు ఒక్కసారిగా కమ్ముకు వచ్చి కుంభవృష్టి( క్లౌడ్ బరస్ట్) కురిపించడం, పెను తుఫాన్లు విరుచుకు పడి, జన, ధన, ఆస్థి నష్టం సంభవించడం సర్వసాధారణం అవుతోంది. వ్యవసాయ ప్రధానం అయిన మన దేశం లో ఈ ముప్పు తీవ్రం గా వుండడం తో వ్యవసాయ రంగంపై జీవిస్తున్న కోట్లాది ప్రజలు, ఈ రంగాన్ని త్యజించి, పట్టణలకు వలస కూలీలుగా వలస వెళ్ళడం దేశం లో నెలకొంటున్న ఒక సామాజిక సమస్యకు దర్పణం పడుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ అధ్యయన నివేదిక ప్రకారం మన దేశం లో వ్యవసాయ ఉత్పత్తులు గత దశాబ్ద కాలం లో 21 శాతం తగ్గిపోయాయని, దిద్దుబాటు చర్యలు లేకపోతే చిన్న చిన్న ఆహార ఉత్పత్తులకోసం కూడా ఇతర దెశాల నుండి దిగుమతుల కోసం ఆధారపడే దుస్థితి సంభవించనున్నదని సదరు నివేదిక హెచ్చరిస్తొంది.

ఇటీవలి కాలం లో ప్రజలు, ప్రజా రవణా వ్యవస్థను మరిచి, ప్రతీ కుటుంబ సభ్యునికొక వాహనం చొప్పున సమకూర్చుకుంటుండడం తో వాతావరణ కాలుష్యం పెంచడం లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పాలకులు కుడా ఈ పెను సమస్య పట్ల ఎటువంటి అవగాహన లేక, పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రజల జీవితాలను గాలీలో దీపం చందాన వుంచడంపై అందరూ సమాలోచన చేయాలి.

Facebook Comments

Leave a Comment