నిర్భందంలో పత్రికా స్వేచ్చ..!

Image Source@News Media Alliance

గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలలోనే కాదు సమాజంలోనూ అసహనం పెరుగుతూ వస్తుంది. భావాలను భావాలతో, వాదనలతో ఎదుర్కోవాలి. కానీ, వైశాచిక దాడులు, తిట్లు శాపనార్ధాలతో నోరు మూయించే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. తాము నమ్మిన నిర్మాణం కోసం శాంతియితంగా ప్రయత్నం చేస్తున్న వారెందరినో దారుణంగా హత్యలు చేయించారు. నచ్చని పత్రికలపై రాజకీయ పక్షాలో, ప్రభుత్వాలో దాడులను ప్రోత్సహించడం వంటివి సమాజంలో ప్రస్తుతం విస్తరిస్తున్న అసహన ధోరణులకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

భారత రాజ్యాంగంలోని 19(1) (ఏ) అధికరణలో ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్ర్యాన్ని,భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని పొందుపరిచారు. అంటే ప్రతి పౌరుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చని,రాయవచ్చని కాదు. ఆ స్వేచ్చకు కొన్ని హేతుబద్ధమైన పరిమితులు సైతం విధించారు. 19(2) అధికరణలో వాక్ స్వాతంత్ర్యాన్ని, సమగ్రతను కాపాడేందుకు, దేశ భద్రత కోసం, ఇతర దేశాలతో సత్సంబంధాల కోసం భావ స్వాతంత్ర్యాన్ని నియంత్రించవచ్చు. పత్రికల్లో కావాలని అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తే, తప్పకుండా పత్రిక మీద దావా వేయవచ్చు. లేదా ఉద్దేశపూర్వకంగా అబద్దాలు ప్రచారం చేశారని క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. కాని, గవర్నరు మీద ఆరోపణలను రాజ్యం మీద దాడిగా భావించడం లేదా ప్రభుత్వం మీద విమర్శని రాజద్రోహ నేరంగా పరిగణించడం నిస్సందేహంగా పత్రికా స్వేచ్చను అరికట్టే ప్రయత్నం చేయటమే. ఈ నేపధ్యంలో ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్రపై, ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ఎదురవుతున్న సవాళ్ళపై లోతైన చర్చ జరగడం అత్యావకాశం. ఆధునిక యుగంలో మానవజాతి ఒక వంక ప్రగతిశీల భావాలను అంగీకరించి మనిషి జీవనాన్ని సుసంపన్నం కావిస్తోంది. మరో పక్క ఇందుకు భిన్నంగా సమాజంలో సంకుచిత ధోరణులు, అసహనం, అభద్రత విస్తరిస్తున్నది. కేవలం జనాకర్షణ కోసం హేతుబద్ధ చర్చల స్థానంలో తిట్లు, శాపనార్ధాలతో కూడిన అనాగరిక చర్చలు నిర్వహించే వాతావరణం, అధికారమే సర్వస్వంగా భావించే వికృత రాజకీయానికి కళ్ళెం వేయలేకపోవడం వంటి వాటి కారణంగా భావప్రకటన స్వేచ్చకి, పత్రికా స్వేచ్చకి సంకెళ్ళు పడుతున్నాయి.

స్వేచ్చని సద్వినియోగం చేసుకోలేని సమస్యకు నియంతృత్వం పరిష్కారం కాదు. ఒక వేళ భావప్రకటన స్వేచ్చ వెర్రితలలు వేసినా, అరుదైన సందర్భాల్లో, సమాజంలో హింసను కావాలని ప్రోత్సహించే సందర్భాలలో తప్ప చట్టం ద్వారా పత్రికలను అడ్డుకోవడం ప్రమాదానికి, నియంతృత్వానికి దారితీస్తుంది. పోటీ, స్వేచ్చ,సమాజం చూపే ఆదరణ ద్వారా తప్ప, హింస,అసహనం,అధికారం, చట్టం ద్వారా భావప్రకటనను హరించే ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని,ఉదార విలువలను, మానవ ప్రగతిని మంట కలుపుతుంది.

Facebook Comments

Leave a Comment