* చమురుకు బదులు ప్రత్యామ్నాయ ఇంధనాలు రావాలి..!

యావత్ ప్రపంచంలోనే చైనా అత్యధిక ముడిచమురు వినియోగదారుగా చెప్పవచ్చు. ప్రణాళికతో అది రష్యా, కజకిస్థాన్లతో దీర్ఘకాల ఒప్పందాలను చేసుకుంది. అదే సమయంలో ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై కాలపరిమితితో కూడిన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇక మన దేశం విషయానికొస్తే సగటు ఇంధన వినియోగంలో ఇండియా ఇప్పటికే వెనుకంజలో ఉంది.

సగటు వ్యక్తిగత ఇంధన వినియోగం 550 యూనిట్లయితే, ప్రపంచసగటు 1,795 యూనిట్లు. చైనా వ్యక్తిగత సగటు వినియోగం 2,359 యూనిట్లు. అంటే ఇప్పటికీ భారత్ అత్యంత పేద దేశాల సరసనే ఉంది. అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలపై ఖర్చు చేసే మొత్తం పెట్రోలు ఉత్పత్తుల ఆదాయం ద్వారా పూడ్చుకొంటున్నాయి. వాస్తవానికి గత నాలుగు సంవత్సరాల్లో మూడేళ్ళ చమురు ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోయినా, ఆ వెసులుబాటు ప్రజలకు లభించలేదు. అందుకు ప్రధాన కారణం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వనరుల సమీకరణకు ఈ పన్నులపై ఆధారపడటమే. ఈ రంగం ప్రభుత్వాలకు బంగారు గుడ్లు పెట్టే బాతుగా కనిపిస్తూ ఉండటమే. కేంద్ర ప్రభుత్వం మౌలిక రంగాలకు ఈ నాలుగేళ్లలో అధిక నిధులు కేటాయించడం వాస్తవమే అయినా అందుకు ఎంచుకున్న ఆదాయమార్గం చమురుపై అధిక పన్నులను వేయడమే. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షక పథకాల అమలుకు అవసరమయ్యే నిధులను ముడిచమురు ఉత్పత్తులపై వేసే పన్నుల ద్వారానే సమకూర్చుకుంటున్నాయన్నది ఆర్ధిక విశ్లేషకుల అంచనా. ఇప్పట్లో ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం,ఇరాన్ ముడిచమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు,దానికి ప్రతిగా చమురు ఉత్పత్తిని మిగతా దేశాలు పెంచకపోవడమే కారణం. ముందుగా పెట్రోల్,డీజిల్ మీద ఆధారపడే రవాణా వ్యవస్థకు ప్రత్యామ్నాయాలు కనిపెట్టాలి. బొగ్గు,సహజ వాయువులపై ఆధారపడి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. దీనికి సైతం భిన్న మార్గాలు కనిపెట్టాలి. ఈ రెండు రంగాలకు ఇతర పరిష్కారాలు కనిపెట్టగలిగే వాతావరణ కాలుష్యం నుంచి బయటపడవచ్చు.

అందుకోసం మన దేశం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో నీటి లభ్యత తక్కువనే చెప్పాలి. మన సాగుభూమిలో కేవలం మూడు శాతంలోనే చెరుకు లాంటి పంటను పండిస్తున్నాం. దీన్ని కనీసం పది శాతానికి పెంచాలి. కానీ,ఇది మనకున్న నీటి లభ్యతతో సాధ్యం కాదు. దీనికి ప్రత్నామ్నాయంగా ఆహార పంటల వ్యర్ధాల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయవచ్చు. ఇది మన దేశ పరిస్థితులకు సరిపోతుంది. ఆ దిశగా మన దేశం పరిశోధనలు చేయాలి. అప్పుడే మన దేశానికి ఇంధన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Facebook Comments

Leave a Comment