స్నేహబంధంలో పూర్వవిద్యార్ధుల కలయిక!

మనం ఎక్కడున్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా,ఎంత సంపాదన ఉన్నా, మనం పుట్టి పెరిగిన ఊరు, చిన్న నాటి స్నేహితులు ఎప్పటికున్నా ప్రత్యేకమే. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వారందరూ ఏడాదికి ఒక్కసారైనా కలుసుకొని, వారి వారి కష్టసుఖాలను, అనుభవాలను, అనుభూతులను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా పూర్వవిద్యార్ధుల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంటారు.

తాము చదివిన కళాశాల లేదా విశ్వవిద్యాలయానికి సహకారం అందించడం ప్రధాన లక్ష్యంగా పూర్వ విద్యార్ధుల సంఘాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పూర్వవిద్యార్ధి సంఘాల ఏర్పాటు, సభ్యులు, విధులు, ఆశయాలు, లక్ష్యాలను వివరంగా రాసుకోవాలని నిర్ణయించి 1915లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూర్వవిద్యార్ధి సంఘం నిబంధనల పత్రాన్ని ప్రచురించారు. తద్వారా నేడు పూర్వవిద్యార్ధి సంఘాలకు ఓ నిబంధనావళీ జతకూడింది. పూర్వవిద్యార్ధులు తాము చదువుకున్న విద్యాలయాలకు వెళ్ళినప్పుడు గౌరవ మర్యాదలు పొందేందుకు వీలుగా వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు పాశ్చాత్య దేశాల్లో కొన్ని విద్యాసంస్థలు ముందుకొచ్చాయి. సాధారణంగా పూర్వవిద్యార్ధుల సంఘం ద్వారా లభించిన నిధులతోనే ఆ భవన నిర్మాణాలు చేపట్టడం ప్రారంభించాయి. కొన్ని దేశాల్లో పూర్వ విద్యార్ధి సంఘం వారు విశ్వవిద్యాలయ న్యాయస్థాన సభ్యులుగానూ కొనసాగుతున్నారు. తాము చదువుకున్న విశ్వవిద్యాలయ సంస్థల్లో వారికి చోటు కల్పించేందుకు ఈ సమావేశాలు అవసరం పడుతాయి. విరాళాల ద్వారా విద్యాలయాన్ని మరింతగా ఆధునికంగా తీర్చిదిద్దుకోవడం,తమ తల్లిదండ్రుల పేరిటో,లేదా తమ పేరిటో వివిధ భవనాలు కట్టించడం,వివిధ విద్యా పథకాలు ప్రకటించడం,చక్కటి ప్రతిభ కనబరిచిన వారికి స్వర్ణ పథకాలు ఇచ్చి ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలకు పూర్వవిద్యార్ధి సంఘాలు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. చివరగా దేశవ్యాప్తంగా విద్యాలయాల వికాసంలో పూర్వవిద్యార్ధి సంఘాల పాత్ర మరింత విస్తరిస్తేనే, ఆ చదువుల తల్లి ప్రాంగాణాలన్నీ సరికొత్త జవజీవాలతో కళకళలాడుతూ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Facebook Comments

Leave a Comment