నిర్లక్ష్యానికి గురవుతున్న ఆహార రంగం..!

ప్రస్తుతం మన దేశంలో ఆహారశుద్ధి రంగం అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న మాట వాస్తవమనే చెప్పవచ్చు. భారతదేశంలో ఆశించిన స్థాయిలో ఈ రంగంలో అభివృద్ధి కనపడటం లేదు. ఒకే పంట నుంచి రకరకాల ఉత్పత్తులు సాధిస్తూ అనేక దేశాలు అద్భుతాలను సృష్టిస్తున్నా,మన దేశంలో ఒక పంట ఒక ఉత్పత్తికే పరిమితం కావడం ఆహార శుద్ధి రంగం ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది.

ఒక పంట నుంచి అనేక ఇతర రకాలను తయారుచేయడమే ఆహారశుద్ధి రంగం ప్రత్యేకత. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయి మనకుంది. కానీ,ఇతర దేశాల నుంచి వస్తున్న ఆహారశుద్ధి వస్తువులకు మన దేశమే ప్రధాన విపణిగా మారడం విధానపరమైన వైఫల్యానికి తిరుగులేని నిదర్శనంగా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహారశుద్ధి రంగంలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదు. వరిధాన్యం, వేరుశనగ, జొన్న, మామిడి, బొప్పాయి, నిమ్మ, టమాటా, మిర్చి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతోంది. ఎగుమతులు మాత్రం ఆరు శాతానికే పరిమితం అయింది. ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ సముద్ర తీరం అందుబాటులో ఉన్నా ఎగుమతులు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ రంగానికి విశేష ప్రాధాన్యం ఇచ్చి ఇప్పటికే ప్రత్యేక విధానాలను ప్రకటించాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో అల్ట్రా మెగాఫుడ్ పార్కును అభివృద్ధి చేస్తోంది. చిత్తూరు, కాకినాడల్లో ఇన్ లాండ్ కంటెయినర్ పోర్టులను స్థాపిస్తోంది. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఊతమిస్తోంది. తెలంగాణలో ఆహారశుద్ధికి ప్రభుత్వం ఇదివరకే పెద్దపీట వేసింది. బుగ్గపాడు వద్ద మెగా పార్కును ఏర్పాటు చేసింది. తాజాగా మహిళా సంఘాల ద్వారా ఊరూరా సూక్ష్మ,చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆహారశుద్ధిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం మన అవసరం.

దేశంలో మార్కెటింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ విభాగంలో విదేశీ పెట్టుబడులు ఆశాజనకంగా లేవు. లబ్ది చేకూరేది విదేశీ సంస్థలకే అయినా, దేశియంగానూ ప్రయోజనాలు ఉండనే ఉంటాయి. ఇక్కడి ఉత్పత్తులను శుద్ధి చేసి మార్కెట్ చేసే క్రమంలో రైతులకు లబ్ది,కార్మికులకు ఉపాధి కలుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆహార ఉత్పత్తుల ఎగుమతిలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి. తద్వారా అన్నదాతలకు అండగా నిలవడంతో పాటు ఆహార భద్రత,వినియోగదారులకు మేలు,మార్కెటింగ్ స్థిరత్వంతో ఆహారశుద్ధి రంగంలో అద్భుతాలు సాధించే దిశగా చర్యలు అవసరం ఎంతైనా ఉంది.

Facebook Comments

Leave a Comment