సామాన్యుల బ్రతుకులను అస్తవ్యస్తం చేస్తున్న ఔషధ ధరలు.!

మన దేశం లో జబ్బులు వస్తే నివారణకు కావల్సిన వైద్యం చేయించుకొని, మందులు కొనుక్కోలేని దుస్థితిలో కోట్లాది మంది ప్రజలు వుండడం ఈ దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం ప్రజల దయనీయ స్థితిని కళ్ళకు కట్టినా దిద్దుబాటు చర్యలు లేకపోవడం దురదృష్టకరం. రోగాలు వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు వైద్య చికిత్సలకే ఖర్చు పెడుతూ చికిత్స కోసం మందులు కొనుక్కోలేక, అయిన కాడికి అన్నీ అమ్ముకొని మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడుతుంటే చోద్యం చూస్తూ ప్రభుత్వాలు వుండడం వారికి ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి వుందో తెలుపకనే తెలుపుతోంది.

దేశం లో మధుమేహం, కేన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రోగాలు 70 శాతం ప్రజలను పట్టి, పీల్చి పిప్పి చేస్తున్నాయన్న చేదు నిజాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రోగాల బారిన లక్షలాది మంది ప్రజలు చికిత్స కోసం అవసరమయ్యే ఔషధాల ధరలు ఆకాశాన్ని అంటుటుండడంతో వాటిని కొనుక్కునే స్థోమత లేని బీదా బిక్కీ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని తమ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. మన దేశం లో కేన్సర్ వంటి మహమ్మారులు ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. ఈ అరుదైన ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే పేటెంట్ ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వాలకు ఎన్ని సార్లు కీలక ప్రతిపాదనలను చేసినా చర్యలు శూన్యమవడం చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే అనడం లో సందేహం లేదు. ఈ పేటెంట్ మందులను మన దేశం ఎక్కువగా బహుళ జాతి మందుల కంపెనీల నుండి దిగుమతి చేసుకుంటోంది. వీటి ధరలు సామాన్యుల అందుబాటులో లేకపోవడం మరియు దేశీయ ఔషధ సంస్థలలో వీటిని తయారు చేయడానికు ఉత్సాహం చూపకపోవడం, ఎన్నో లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు సమయానికి మందులు దొరక్క , దొరికినా వాటి ధరలు తమకు అందుబాటులో లేకపోవడం తో ప్రాణాలు పోగొట్టుకుంట్టున్నారు. పశ్చిమ దేశాలలో ఔషధాల ధరలను జనం కొనుగోలు శక్తి బట్టి నిర్ణయించే వ్యవస్థ వుంది మరియు దేశీయ సంస్థలకు తప్పని సరి లైసెన్సులను జారీ చేసి ఔషధాలను జన బాహుళ్యానికి అందుబాటులోనికి తెస్తారు. కొన్ని సంవత్సరాల పాటు ధరల నియంత్రణ ఉన్నత స్థాయి కమిటీ, నిరంతర ప్రతిపాదనలతో, దిగి వచ్చిన ప్రభుత్వం 2012 లో కేన్సరు చికిత్స కోసం నెలకు 2.8 లక్షల వ్యయమయ్యే ఔషధాలను తప్పని సరి లైసెన్సు విధానం తో తొమ్మిది వేల రూపాయలకు అందుబాటులోనికి తీసుకురావడం అభినందనీయం.30 వేల కోట్ల వార్షిక లావాదేవీలు జరుగుతున్న ఔషధాల విఫణిలో 30 శాతం పేటెంట్ మందులే వుండడం ఆశ్చర్యం. ఔషధాల ధరలను నియంత్రించి పేదా మధ్య తరగతి వారికి అందుబాటులోనికి తెస్తామని ఢంభాలు పలుకుతున్న ప్రభుత్వం కేన్సరు చికిత్సకు వుపయోగించే ఇంజెక్షను లక్ష రూపాయలు వుంటే వాటి ధరను అందుబాటు లోనికి తేకపోగా, కొత్తగా పేటెంట్ పొందిన అరుదైన వ్యాధులకు ఉపయోగించే ఔషధాన్ని, ఔషధ విభాగం మార్కెట్ లోనికి ప్రవేశపెట్టి వాటిని అయిదేళ్ళపాటు ధరల నియంత్రణ నుండి మినహాయింపు ఇవ్వడం ప్రభుత్వాల నిష్కృయాపరత్వానికి మచ్చుతునక. ప్రధాన మంత్రి జన ఔషధ పరియోజన ( పి ఎం బి జె పి) పధకం ద్వారా దేశీయం గా నాలుగున్నర వేల జెనెరిక్ ఔషధ సేవలు నామమాత్రపు ధరలకు ఔషధాలను విక్రయిస్తునట్లు, 256 అత్యవసర ఔషధాల ధరలను తామే నియంత్రిస్తునట్లు లొక్ సభలో ప్రకటన చెసిన ప్రభుత్వం పేటెంట్ మందులను ధరల నియంత్రణ పరిధి లోనుండి తొలగించడం గర్హనీయం, ప్రజారోగ్యం పట్ల వారి నిర్లక్ష్య వైఖరికి తార్కాణం.

మన దేశం లో ప్రజలు 63 శాతం స్వంతం గా వైద్య ఖర్చులు భరిస్తూ వూంటే అదే ఖర్చులను భరిస్తున్న ప్రపంచ సగటు 18 శాతం వుందంటే మన దేశీయ వైద్యం అందని ద్రాఅక్ష తరహాలో వుందనడం లో ఏమాత్రం సందేహం లేదు. మన దేశం లో కేన్సరు వ్యాధికి చికిత్స తీసుకుంటే చికిత్సతో ప్రాణం రక్షింపబడుతుందన్న హామీ లేకపోగా, వారి పదేళ్ళ వార్షిక ఆదాయం ఆవిరైపోవడం, సదరు రోగి కుటుంబాలు రోడున పడడం సర్వ సాధారణమైపోయింది. బహుళ జాతి ఔషధాల సంస్థలు పరిశోధనా అభివృద్ధి నిమిత్తం ఎక్కువ మొత్తాలను వెచ్చిస్తున్నందున ధరల నియంత్రణ సాధ్యం కాదని చెబుతుంటే, ప్రభుత్వాలు డూ డూ బసవన్నల వలె వారికి అనుకూలంగా తలలు ఊపడం మన ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవాలి. అమెరికా వంటి ధనిక దేశం కూడా ప్రాణంతక వ్యాధుల ఔషధాలను జనం అందుబాటులోనికి తెచ్చినప్పుడు, మన దేశం ఇంకా ఈ విషయం లో మీనమేషాలు లెఖ్ఖించడం మానవతా విలువలకు త్రిలోదకాలివ్వడం తప్ప మరొకటి కాదు.

Facebook Comments

Leave a Comment