వయోవృద్ధులకు చేయూతనివ్వాలి..!

Photo Source@Youth Ki Awaaz

వృద్ధపౌరులు ప్రపంచమంతటా అన్ని కులాల్లో,అన్ని మతాల్లోనూ ఉన్నారు. తమ సంతానానికి, వారి ఆప్యాయతలకు, అనురాగాలకు దూరమై, తమ వయసున్న వారితో స్నేహం చేసి వారి సలహాలను, సూచనలను పొందుతున్నారు వృద్ధులు. వృద్ధుల కోసం, అదీ మధ్య తరగతి, ధనిక వర్గాల వారి కోసం, అందునా పేయింగ్ గెస్ట్ లుగా ఉండే వారు ఒకటిగా ఏర్పడి వృద్ధాశ్రమాల్లో, ఓల్డ్ ఏజ్ హోముల్లో గడుపుతున్నారు.

బరువు బాధ్యతలు వీలైనంత దించుకొని, కొంత స్వచ్చందంగానూ, కొంత తప్పనిసరిగానూ, కొంత అయిష్టంగానూ, కొంత అసంతృప్తిగానూ వారి యొక్క శేష జీవితాన్ని గడుపుతున్నారు. పెన్షనర్ల అసోసియేషన్లు, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం, వృద్ధ పౌరుల సంఘాలుగా ఏర్పడి అటు సమాజానికి,ఇటు దేశానికి ఎంతో సేవ చేయాలనుకుంటున్నారు. నిరుపేద వృద్ధపౌరుల విషయానికొస్తే వారి జీవితాలు మరీ దుర్భరంగా ఉంటున్నాయి. చేతిలో చిల్లి గవ్వలేక వృద్ధాశ్రమాల్లో చేరలేకపోతున్నారు. తీరా అక్కడ ఎవ్వరూ చేయూతనివ్వరు. కొంతమంది కూతుళ్ళు, కొడుకులు మాత్రమే వాళ్ళకి మర్యాదలు, గౌరవాలను ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రపంచమంతటా వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడానికి గల కారణాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడమే. ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలిద్దరూ పని చేసి బతకాల్సిన పరిస్థితి రావడం, డబ్బు, విలాసవంతమైన జీవితం, పిల్లల స్వేచ్చా స్వాతంత్రాలు, స్వార్ధం, సమాజం, సంతానం, ప్రభుత్వం వారి బాగోగులను చూసేందుకు ముందుకురాకపోవడం. వృద్ధులు వారు కన్న బిడ్డలతో గడపలేక, వారికి దూరంగా ఉంటూ, వారి తిట్లు, చివాట్లను, చీదరింపులను, అవమానాలను భరించలేక, తమ వయసున్న వారితో కష్టసుఖాలను చెప్పుకుంటూ, ఉపశమనం పొందుతున్నారు. కొన్ని దేశాల్లో వృద్ధులు మళ్ళీ పెళ్ళి చేసుకొని సంతోషంగా బతికున్నంతకాలం హాయిగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు.

రిటైర్ మెంట్ తీసుకున్న ఉద్యోగస్తులు, వృద్దాప్య, వితంతు పెన్షన్లు పొందుతున్న వృద్ధపౌరులు తమకు మళ్ళీ పెళ్ళి కాలేదని, తాము ఇంకా బతికే ఉన్నామని సర్టిఫికెట్లు ఇస్తే కానీ, పెన్షన్లు పొందలేని పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో వృద్ధులను ఎంతవరకు మన ఇళ్ళల్లో వారి వారసులు ఏ మాత్రం గౌరవిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

Facebook Comments

Leave a Comment