గ్రామాలకు ప్రాథమిక వైద్యం చేరేదెన్నడు?

Photo Source@Health Opine for India

వైద్యం వ్యాపారం కాదు. అన్నింటికన్నా మనిషి ప్రాణం చాలా విలువైనది. కారణం ఏమైనప్పటికీ కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. మన దేశంలో వైద్యుల సంఖ్య తక్కువనే చెప్పాలి. వైద్యవిద్య అభ్యసించినవారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ప్రతి ఏటా వైద్య కళాశాలల నుండి వస్తున్న విద్యార్ధుల సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది స్నాతకోత్తర కోర్సులు చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పల్లెలు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్ధులు సైతం కార్పోరేటు వైద్యశాలల పట్ల ఆకర్షితులవుతున్నారు. తమ స్వస్థలాల్లో సేవలను అందించేందుకు సుముఖత చూపడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్న క్షేత్రస్థాయిలో ఇవి సరైన ఫలితాలను అందించలేకపోతున్నాయి. గ్రామస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంస్థాగతంగా బలోపేతం చేయకపోవడం, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పెంచకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికీ 24గంటల వైద్య సౌకర్యం అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో లభించడం లేదనే చెప్పవచ్చు. 108 అత్యవసర వాహనం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళకపోవడం, విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం, సంస్థాగత లోపాల వల్ల ప్రజలు ప్రైవేటు అంబులెన్సులపైన ఆధారపడాల్సి వస్తోంది. 104వాహనంలోని వైద్య సిబ్బంది సరిపడా అవగాహన లేక మందుల వాడకంపైన ప్రజలకు సరైన సలహాలను ఇవ్వలేకపోతున్నారు. దీంతో వ్యాధి పెరిగిన తరువాత ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళాల్సివస్తోంది. అక్కడ వైద్య ఖర్చులు అపరిమితంగా ఉండటం వల్ల ప్రజలపైన ఆర్ధిక భారం పడుతోంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనారోగ్యానికి గురైనా, శస్త్ర చికిత్స చేయించుకున్నా ఆ కుటుంబం కష్టాలపాలవుతోంది. ప్రతి మనిషికి బతకాలనే కోరిక ఉంటుంది. కుటుంబసభ్యులకు బతికించుకోవాలనే ఆశ ఉంటుంది. కానీ, ఇందుకు ఆర్ధిక పరిస్థితులు అనుకూలించడం లేదు.

ఒక మనిషిని మానవతావాదిగా తయారుచేస్తేనే, సహృదయం గల స్పందించే వైద్యుడు తయారవుతాడు. వ్యాపారానికి, వైద్యానికి సంబంధం లేని విధంగా మన వ్యవస్థలలో మార్పులు రావాలి. ప్రజలు భరోసాతో వైద్యశాలలకు రావాలి. అప్పుడే వైద్యుడు పూర్తిస్థాయిలో నారాయణుడవుతాడనటంలో ఎలాంటి సందేహం లేదు.

Facebook Comments

Leave a Comment