పల్లెకు చేరని ప్రగతి బండి..!

అభివృద్ధి బాటలో నగరాలతో పాటు పల్లెలూ, గిరిజన ప్రాంతాలూ పాత్రధారులైనప్పుడే భారతదేశం నిజమైన ఆర్ధికాభివృద్ధి సాధించగలదు. ఈ కల నిజం కావాలంటే, ఆర్ధిక రంగంతో పాటు వ్యవసాయం, పరిపాలనా, గ్రామీణ వైద్య, విద్యా రంగాల్లో కొత్త సంస్కరణలు రావాలి. నేడు గ్రామీణ ప్రజలకు అడుగడుగునా పలు రూపాల్లో అవరోధాలు ఎదురవుతున్నాయి. నాసిరకం విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులను అమ్ముతున్న కంపెనీలు, షాపుల నిర్వాహకుల ఆట కట్టించడానికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధిని చూపకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నాయో అర్ధం కావడం లేదు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటం సమ్మిళిత అభివృద్ధికి కీలకంగా పనిచేస్తుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి కొత్త కొత్త పద్ధతులు అవలంభించిన రాష్ట్రాల్లో ఫలితాలు గణనీయంగానే వచ్చాయి. మరికొన్ని రాష్ట్రాల్లో గ్రామాల సేద్య ఉత్పత్తులను ఒకే చోటుకు తెచ్చి క్రయ విక్రయాలు జరిగేలా ప్రయోగాలు సఫలమైనవి. కేరళలో పేద మత్స్యకారుల సంఘాలు చేపల వ్యాపార అభివృద్ధికి తోడ్పడినవి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాల కంపెనీలు కుమ్మకై, రైతులు అమ్మేటువంటి పాలలోని వెన్న శాతాన్ని తగ్గించి చూపుతున్నాయి. అవే పాలను వేరే చోట పరీక్షిస్తే వెన్న శాతం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అంశంపై ఎవ్వరికి ఫిర్యాదు చెయ్యాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. గత 25ఏళ్ళ ఆర్ధిక సంస్కరణల కాలంలో జిడిపిలో వ్యవసాయం వాటా బాగా తగ్గిపోవడమే గాక, గ్రామీణ యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కుంగిపోయాయి. స్మార్ట్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తదితర అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంభిస్తే అధికార యంత్రాంగంలో అవినీతిని అరికట్టవచ్చనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది.

మారుతున్న కాలానికనుగుణంగా ప్రజల్లో చైతన్యం పెరగనంత వరకు కేవలం టెక్నాలజీతోనే పని జరగదని ప్రభుత్వాలు గమనించాలి. ప్రజలు ప్రతిదానికి ప్రభుత్వంపై ఆధారపడటం అభిలాషనీయం కాదు. సంస్కరణలు అమలుచేసే క్రమంలో ప్రజల భాగస్వామ్యం కూడా పెరగాలి. అప్పుడే ఆర్ధికాభివృద్ధిలో పట్టణాలతో పాటు గ్రామాలు కూడా నిజమైన ప్రగతిని సాధిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Facebook Comments

Leave a Comment