సమిష్టి కృషితోనే భాషాభివృద్ధి సాధ్యం..!

Image Courtesy: Chinnari

సమాజ అభ్యుదయానికి విద్యారంగమే పునాది అని చెప్పవచ్చు. భారతీయ భాషలు అభివృద్ధి చెందలేదని,ఆ విజ్ఞానం శాస్త్రీయమైనది కాదని పలు విపరీత భావనలను ప్రచారం చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. బ్రిటీషు వారికి అనుకూలత కలిగించడమే ధ్యేయంగా ఆంగ్లవిద్య ప్రవేశించింది. ఒకప్పుడు అది వ్యామోహంగా ఉన్నది. ఆ తదనంతరం అవసరంగా మారినటువంటి పరిస్థితి. భాషకు సంస్కృతి ఆత్మలాంటిది. సంస్కృతికి భాష దేహంలా నిలుస్తుంది. జాతికి, దాని భాషా సంస్కృతులకు విడదీయరాని సంబంధం నెలకొంటుంది.

ఎక్కడైనా సంస్కృతి చిరకాలం మనగలుగుతోందంటే, దానికి భాషాను బంధమే మూలకారణం అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత గొప్ప అనే భావం విద్యార్ధులో సామాన్యంగానే ఉండేది. పలువురు మాతృ భాషతో పాటు ఆంగ్లం,హిందీ,సంస్కృతం వంటి ఇతరత్ర భాషల్లోనూ ప్రావీణ్యం సాధించేవారు. విశ్వవిద్యాలయాల స్నాతకోత్తర స్థాయులల్లో వివిధ భాషలు అభ్యసించేవారి సంఖ్య గణనీయంగా ఉండేది. వారికి విద్యారంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఒడిశా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం,విజయనగరం చుట్టుపక్కల ఒడిస్సీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని రాయలసీమ జిల్లాల్లో తమిళ, కన్నడ, తెలంగాణలో ఉర్ధూ, పర్షియన్, మరాఠీ, కన్నడ భాషలను అవి మాతృ భాషలుగా ఉన్నవారు అభ్యసించేవారు. జాతీయ భాషగా హిందీని ఎక్కువ మంది అభ్యసించేవారు. హృదయ వికాసానికి భాషల అధ్యయనం దోహదం చేస్తుంది. ఆ భాషాశాస్త్రాలని అభ్యసిస్తే ఉపాధి లభిస్తుందన్న కచ్చితమైన హామీ ఉంటేనే, విద్యార్ధులు చేరుతారు. విద్యారంగంలో భాషల అధ్యయనం తగ్గకుండా,క్రమేణా అవి అంతరించకుండా కాపాడటానికి ప్రభుత్వాలే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాటిని అభ్యసించేవారికి ప్రోత్సాహకాలు లేదా ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలి. దీన్ని సాంస్కృతిక న్యాయం అని కూడా అనవచ్చు. అనేక ప్రాంతాల్లో ప్రాచ్య కళాశాలలు చాలావరకు మూతపడ్డాయి. ఒకప్పుడు ఎంతో వైభవోపేతంగా ఉన్న ప్రభుత్వ సంస్కృత కళాశాలలు ప్రస్తుతం విద్యార్దులే కరువైన దయనీయ స్థితికి చేరాయనడంలో సందేహం లేదు. గ్రూప్ పోటీ పరీక్షల పాఠ్యప్రణాళికలో భాషాశాస్త్రాలు, సాహిత్యాంశాలకు ఉనికి లేదు. పర్యవసానంగా, వాటిని అధ్యయనం చేసినవారు ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారు.

ప్రభుత్వాలు ఆలోచించి అటువంటి వారికి సముచిత ప్రోత్సాహం కల్పించాలి. కళాశాలల్లో, పాఠశాలల్లో భాషా బోధకుల నియామకాలపై సంపూర్ణ శ్రద్ధ వహించాలి. అప్పుడే మన భాషలు మరుగునపడకుండా ఉంటాయి. దేశభాషల మనుగడతోనే సాంస్కృతిక వికాసం సాధ్యపడుతుందని చెప్పవచ్చు.

Facebook Comments

Leave a Comment