కాలుష్య విషవలయంలో రాలుతున్న పసిమొగ్గలు..!

Photo Source@woodsmokepollution

బాలల బంగరు భవితను సుందరంగా నిర్మించడంలో కీలక పాత్ర ప్రకృతిది. దాని పరిరక్షణను ప్రభుత్వాలు విస్మరించడం వల్ల ఆబాలగోపాలం ఇక్కట్లపాలవుతూనే ఉంది. అమూల్యమైన పర్యావరణ రంగంలో అతి ప్రమాదకర మార్పులా..అంటూ ఐక్యరాజ్యసమితి గతంలోనే ప్రశ్నించింది. అందరికీ జలమే ఆధారం. అది కలుషితమైన కారణంగా మనదేశంలోని ఐదేళ్ళలోపు చిన్నారుల్లో ఏటా దాదాపు 17లక్షల మంది శాశ్వతంగా కన్నుమూస్తున్నారు.

అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత జలాలనే తాగక తప్పని పరిస్థితుల్లో వ్యాధుల బారిన పడి ఏటా వేల సంఖ్యలో పిల్లలు విగతజీవులవుతున్నారు.నీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు చట్టాలు లేకపోలేదు. 1974లో ఒకసారి,అనంతరం మూడేళ్ళకు మరోసారి దేశంలో ఆ చట్టాలు తెచ్చారు.అమలు తీరు సరేసరి.నానారకాల మురికి పదార్ధాలూ నీళ్ళలో కలుస్తున్నాయి. ద్రవ,ఘన,వాయు వ్యర్ధాలెన్నో నీటిలోకే చేరుతున్నాయి.ఇది పిల్లలపాలిట ప్రాణాంతకమవుతోంది. నానారకాల కాలుష్యాలతో ప్రాణాలు కోల్పోతున్నవారెందరో..వారిలో 92శాతం పేద లేదా తక్కువస్థాయి ఆదాయాలు గల దేశాలవారున్నారు.ఆ మృతుల్లో అనేకమంది బాలలేనని ఓ అంతర్జాతీయ వైద్య పత్రిక తాజా అధ్యయనం నిర్ధారించింది. వాయుకాలుష్యం వల్ల మనదేశంలో ఉత్తరాది ప్రాంతాల్లో అయిదేళ్ళలోపు పసివాళ్ళు ఏటా 6 లక్షల మంది మృత్యువు పాలవుతున్నారు.వివిధ దేశా ల్లో 30కోట్ల బాలబాలికలు విషపూరిత వాయువుల వల్ల పలు రుగ్మతలకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.ధూళితో నిండిన రోడ్లు,వాటిపై ధూమకాలుష్యం తెచ్చే చేటు అంతా ఇంతా కాదు.పరుగులు తీసే పొగల బండ్లు పిల్లల గుండెల్ని అదరగొడుతున్నాయి.పరిశ్రమల నుండి వెలువడే పొగ వాయువులు,కర్మాగారాలు విడుదల చేసే రసాయన తదితర వ్యర్ధ పదార్ధాలు లక్షలాది పిల్లల జీవితాలకు ఎడాపెడా తూట్లు పొడుస్తున్నాయి.వారి మెదడు,ఊపిరితిత్తులపై అవి పెనుప్రభావం చూపుతున్నాయి.బాలల వ్యాధినిరోధక వ్యవస్థను అత్యంత దారుణంగా దెబ్బతీస్తున్నాయి.అనేక దేశాల్లో ఏటా 34 లక్షల పసికందులు నెలలు నిండకుండానే పుడుతున్నారంటే,వాయుకాలుష్య తీవ్రతే మూలకారణం.కాలుష్య రక్కసికి లెక్కలేనన్ని రూపాలు.అది గాలితో పాటు భూమిని,జలాల్ని విషమయం చేస్తుంటే,పసిప్రాణాలు నిలిచేదెలా? పర్యావరణ పరిరక్షణను లక్షించి మనదేశంలో చట్టం రూపొంది 33ఏళ్ళు గడిచాయి. వివిధ పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలు ఒకటీ రెండూ కాదు,మూడు దశాబ్దాలుగా ఉన్నాయి.వాటి అమలు అప్పటి నుంచీ అంతంతమాత్రమే! అలా అని పర్యావరణాన్ని రక్షించడం ప్రభుత్వశాఖలకో,స్వచ్చంద సంస్థలకో పరిమితమా?కానే కాదు.అది సమాజంలో ఉండబడే ప్రతి ఒక్కరి ప్రధమ కర్తవ్యంగా భావించాలి. కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం మానవహక్కుల్లో అంతర్భాగం.. అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆ తీర్పు బాలల హక్కులకూ వర్తిస్తుంది.వారు కాలుష్యాల బారిన పడకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలని నిలదీసింది.

స్వచ్చమైన గాలి,నీరు కల్పించకపోవడం అంటే జీవించే హక్కును కాలరాయడమే అవుతుందనీ పేర్కొంది. శబ్దకాలుష్యం కలిగించే అనుభవాలు ఎంత భయానకమో చెప్పనలవి కాదు. వాటి వల్ల బాలబాలికలకు నరకయాతనే! ఒక్క వినికిడి శక్తినే కాదు..మెదడు, రక్తప్రసరణ, జీర్ణశక్తి,జీవక్రియలన్నింటిపైనా ధ్వని కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇన్ని రకాల కాలుష్యాల కోరల్లో చిక్కిన బాలల్ని కాపాడే చత్రాలు రెండు. స్వచ్చత కోసం పరితపించే ప్రభుత్వాల నిబద్దత ఒకటి. దానికి కుడిఎడమల దన్నుగా నిలిచే పౌరసమాజ బాధ్యతాయుత వైఖరి మరొకటి.ఈ రెండింటి కలయికతోనే కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యపడుతుంది.

Facebook Comments

Leave a Comment