పంచాయతీల్లో యువత భాగస్వామ్యం అవసరం..

గ్రామాలల్లో ప్రజాస్వామ్యం వికసించి,అవి స్వయం సమృద్ధి అయినప్పుడే జాతి పురోగతి సాధ్యమని సెలవిచ్చారు మహాత్మాగాంధీ.. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో స్వయం పాలన బాట పట్టించడం కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నవసమాజ నిర్మాణంలో గ్రామాలే కీలకం.రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి పధకాలు ప్రవేశపెట్టిన అవి గ్రామాలలో క్షేత్రస్థాయిలో, ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడకుండా జరగాలంటే గ్రామ సర్పంచ్ లపై ఆధారపడి ఉంటుంది.

కుటుంబంలోని ప్రతి వ్యక్తి బాగున్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది.అంటే దేశంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది.దేశానికి గ్రామాలే పట్టు కొమ్మలు. అవి బాగున్నప్పుడే చూడడానికి అందంగా,ఆనందంగా ఉంటుంది.ప్రజాస్వామిక దేశంలో సకాలంలో గ్రామాలలో స్వయంపాలన కొనసాగించేందుకు ప్రభుత్వాలు,ఎన్నికల సంఘాలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కానీ,దురదృష్టవశాత్తూ స్వాతంత్ర్యానంతరం నుండి ఏనాడూ కూడా సకాలంలో గ్రామస్థాయిలో ఎన్నికలు జరపలేని దుస్థితి నెలకొంది.మన రాష్ట్రంలో గత ఐదారు నెలల నుండి గ్రామ పాలకులను నియమించలేకపోడానికి కారణం రిజర్వేషన్ల గొడవ హైకోర్టులో ఉండటమే.జనాభా ప్రాతిపాదికన అతి త్వరగా రిజర్వేషన్లు కల్పించి ఈ సమస్యకు పరిష్కారం చూఫాల్సిన అవసరం ఉంది.గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంతో వివిధ పార్టీల నాయకులు ద్వితీయ,తృతీయ శ్రేణుల నాయకుల హడాహుడి అంతా ఇంతా కాలేదు.శాసనసభ ఎన్నికలు పూర్తయిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జనవరిలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే తపనతో ముందుకెళ్ళడంలో భాగంగా,2013లో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించారు.ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలు పర్చాలనుకుంటూ 1.15పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడకు చేర్చడం జరిగింది.ఇటీవల కొత్తగా ఏర్పాటయిన 4,380గ్రామ పంచాయతీలతో కలిపి 12,751గ్రామపంచాయతీలుండటం, వాటిలో 1,13,270వార్డులుగా విభజించి రెండు లక్షల మంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేసుకొని,ఈ దఫా ఎన్నికల ఖర్చు 200కోట్లని అంచనా వేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో యువత ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.ఐతే ఈ ఎన్నికల్లో డబ్బు,మద్యం,బహుమతులు, కులమత, బంధుత్వాలు, కట్టుబాట్లు ఇలా అనేక రకాలుగా ఓటర్లను ప్రభావితం చేస్తున్న వేళ ఓటర్లు చైతన్యవంతులై అవినీతిరహితంగా విలువలతో కూడిన,నిస్వార్ధంగా సేవలందించే నాయకులకు పాలనా పగ్గలు అప్పగించండి.మన తలరాతలను మార్చేది ఒక్క ఓటు మాత్రమే.దానిని అమ్ముకొని ఆగం కాకూడదు.ఆయా గ్రామాల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి.ఇంతకు ముందు గ్రామాల్లో గెలిచిన నాయకులు ఏమి అభివృద్ధి చేశారు.రేపు మీరు గెలిస్తే ఏమి అభివృద్ధి చేస్తారో?అని అడిగి,వారి నుండి రాతపూర్వకంగా హామీ తీసుకోండి.ఎవ్వరైతే సమస్యలను తీరుస్తానంటరో వారికే మద్దతివ్వండి.ముక్క,సుక్క,నోటుకు బానిసలు కాకుండా,దూరంగా ఉన్నప్పుడే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయి. ఈ సారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో యువతరం కీలకపాత్రనే పోషించబోతుందని చెప్పవచ్చు.ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి.ఇప్పటికే తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి.

ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగి అప్పుడే సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఎక్కువ మోతాదులో నిర్వహించుకోబోతుంది అని చెప్పవచ్చు.అన్ని పంచాయతీల్లో యువత మేల్కొని ఓటర్లను చైతన్య పరుస్తూ,గ్రామాభివృద్ధికి నిస్వార్ధంగా పనిచేసే నాయకులను ఎన్నుకోడానికి దోహదపడాల్సిన అవసరం ఉంది.

Facebook Comments