ఎన్నికల్లో మహిళలకు అవకాశాలేవి?

జనాభాలో సగభాగమైన మహిళలకు అవకాశాల్లో ఆశాభంగమే ఎదురవుతోంది. సగమంటే సగం కాదు కదా, కనీసం మూడో వంతు అవకాశాలూ వారికి దక్కడం లేదు. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. రాజకీయ రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ రంగంలో మహిళలు పోరాటాలు,ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. బ్రిటీషు హయాం లో మహిళలకు ప్రప్రధమంగా 1921లో ఓటు హక్కు లభించింది. అప్పట్లో అది ఆర్ధికంగా సంపన్న వర్గాలకే పరిమితమైంది.

భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించాక మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ వారికి సమున్నత స్థానం కట్టబెట్టింది. అంతటితోనే మహిళా ప్రగతి ఆగిపోయింది. తరువాతి రోజుల్లో పార్టీలు, ప్రభుత్వాలు వారికి ప్రాధాన్యంపై చాలా ఆలస్యంగా అడుగులు పడ్డాయి. తొలిసారిగా 1953లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో యశోధాదేవి అనే మహిళ బాన్స్ వారా నియోజకవర్గం నుండి సోషలిస్టు పార్టీ తరుపున బరిలో నిలిచారు. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన మహిళా శాసనసభ్యుల సంఖ్య సైతం పరిమితంగానే ఉంది. ఉత్తరప్రదేశ్ లో నాలుగు వందలకు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ, 41చోట్ల మాత్రమే మహిళలు విజయం సాధించారు. పంజాబులో 117 స్థానాలకు గాను ఆరు స్థానాల్లోనే విజేతలుగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ లో 70 స్థానాలకు గాను ఐదు స్థానాల్లో మహిళలు నెగ్గారు. పార్టీల పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతం చేసే బాధ్యత మహిళా కార్యకర్తలు తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. ఎన్నికల సమయంలో మాత్రం నాయకులు వారి కళ్ళకు గంతలు కట్టి వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. ప్రజలతో మమేకమై అలుపెరగని పోరాటం చేస్తూ క్రియాశీలంగా ఉన్న మహిళలకు పార్టీల్లో సరైన స్థానం లభించడం లేదు. ఆర్ధికంగా, సామాజికంగా కిందిస్థాయి నుండి వచ్చినవారు అన్ని రాజకీయ పార్టీల్లో ద్వితీయ శ్రేణి కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు తప్పా- ప్రత్యేక గుర్తింపునకు నోచుకోవడం లేదు. రాజకీయాల పట్ల మహిళలు విముఖత చూపడానికి ఇదీ ఒక కారణంగా చెప్పవచ్చు. పార్టీలు తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో మహిళల కోసం ఘనంగా వరాలు ప్రకటిస్తున్నాయి. అంతే తప్ప వారికి కేటాయించే స్థానాల విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదు. ఆ దిశగా అడుగులు పడితేనే సిసలైన మహిళా సాధికారతకు బాటలు పడతాయి.

ఏళ్ళ తరబడి రాజకీయాల్లో రాజ్యమేలుతున్న కుటుంబాల్లో రెండో తరం, మూడో తరం వారికి పలుకుబడి మీద టిక్కెట్లు కేటాయిస్తున్నారు. కూతుళ్ళు, కోడళ్ళకు సీట్లిచ్చి మహిళలను రాజకీయ పావుగా వాడుకుంటున్నారు తప్ప వారికి న్యాయంగా రావాల్సిన వాటా విషయాల్లో పార్టీలు నోరు మెదపకపోవడం విడ్డూరం.

Facebook Comments