మాతృభాష అమలుకు చిత్తశుద్ధి చూపాలి..

మాతృభాష అయిన తెలుగుపై పాలకుల అభిమానం,ప్రేమ,వాత్సల్యం లేదు అనుకోలేం. తెలుగుకు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా సభలు,సమావేశాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ మరో పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఇంగ్లీష్ మోజులో పడి తెలుగుకు తీరని అన్యాయం చేస్తున్నారు. కడుపుచించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు.

తెలుగు భాషకు జరుగుతున్న ద్రోహం, అందువల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించి పరిశీలిస్తే ఆవేదన కలగక తప్పదు. ఇదంతా ఎవరో పరాయి వాళ్లు చేస్తున్నది కాదు. సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు 1996 మే 14న ఆనాటి ఉమ్మడి రాష్ట్రం అధికార భాషగా గుర్తించింది. పరిపాలనకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు,ఫైళ్ళు అన్నీ తెలుగులోనే ఉండాలని నిర్ధేశించారు. కానీ ఈనాటికీ అవి అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు ఒకటో తరగతి నుంచి ప్రవేశపెట్టే కార్యక్రమం ఆరంభమైంది. జీవిత సారాంశాన్ని వడబోసి రచించిన సుమతీ, వేమన లాంటి శతకాలు మరుగైపోయాయి. రానురాను తెలుగు కనుమరుగైపోతుందనే తెలుగు భాషాభిమానులు పడే ఆవేదనను అర్ధం చేసుకునేవారు లేరు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఉభయరాష్ట్రాల్లో తెలుగు అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం సామాన్యులను సైతం తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తుంది. పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కింది స్థాయి పోలీసు అధికారులు తమ ఉత్తర ప్రత్యుత్తరాలను స్థానిక భాషలోనే జరుపుతున్నారు. దీనిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయవచ్చు. దీనికి కొత్త చట్టం చేయాల్సిన పని లేదు, భారత శిక్షాస్మృతి 272 ప్రకారం కోర్టు మినహా దిగువ న్యాయస్థానాలు తెలుగు భాషను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒక్క పోలీసు శాఖే కాదు.

అన్ని శాఖల్లోనూ తెలుగును చిత్తశుద్ధితో అమలు చేస్తే సామన్యులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. తద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Facebook Comments

Leave a Comment