జాతి శ్రేయస్సు కొరకు లిక్కర్ రక్కసిని నియంత్రించాలి..!

మానవ వనరుల బహుముఖ వికాసం ద్వారా సమగ్ర సామాజిక అభ్యున్నతి సాధించడానికే ప్రజా ప్రభుత్వాలున్నది. పెను సామాజిక విధ్వంసం సృష్టించే మద్యాన్నే ప్రధాన రాబడిగా ఎన్నుకొని అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు..చిల్లులు పడిన కుండతో నీళ్ళు మోసిన చందంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మద్యం రాబడులపై ఎక్కువ మక్కువతో ప్రతియేట కొత్త కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వెడుతున్నాయి మన ప్రభుత్వాలు. పౌష్టికాహారం లేకపోవడంతో ప్రపంచంలో అత్యధికంగా గత ఏడాది కొన్ని లక్షల మందికి పైగా శిశువులు మరణంచిన విషాదాలు గుండెల్ని పిండేసాయి.

21వ శతాబ్దిలో మానవాళికి ఆరోగ్యపరంగా ఎదురయ్యే సవాళ్ళను అవగతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సాగించిన అధ్యయనం – అంతర్జాతీయంగా 240 కోట్ల మంది తాగుబోతులున్నారని, మద్యం వినిమయ పోకడల్లో తేడాలున్నా ఆయా సమాజాలపై దాని దుష్ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని స్పష్టీకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముప్పిరిగొంటున్న వ్యాధుల భారంలో ఐదు శాతానికి పైగా ఆల్కహాల్ పుణ్యమే. రోగగ్రస్థ జాతిని కాదు మనం కోరుకునేది.. అంటూ మద్య ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి తీరాల్సిన బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు 2006లోనే గుర్తుచేసింది. మొత్తం మద్యం అమ్మకాల్లో మూడు వంతులు ప్రభుత్వ నియంత్రణలోని సంస్థల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయంటే.. కన్నీటి కాష్టాలు రగిలించి, సురలు పొంగించి, వాటి నుంచే సంక్షేమ రాజ్యాన్ని సంస్థాపించాలన్న అబ్కారీ సర్కార్ల దూరదృష్టి ఆశ్చర్యపరుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా తాగుబోతుల్లో నాలుగో వంతుకు పైగా కౌమార వయసులోని వారే ఉన్నారన్న నివేదికాంశాలు, ఇండియాలోనూ మత్తుపానీయాల రుచి మరిగే వయసు 13 ఏళ్ళకు దిగివచ్చిందన్న దిగ్ర్బాంతికర నిజాలు జాతి భవితకు పెనుసవాళ్ళుగా మారబోతున్నాయి. తాగుడు వ్యసనంతో ఇళ్ళూ, ఒళ్ళూ గుళ్ళ చేసుకొంటున్న మందభాగ్యుల్ని చేరదీసి, ఆ మహమ్మారి చెరనుండి వారిని బయటపడేసే విహిత కర్యవ్యాన్ని నిర్వర్తించాల్సిన ప్రభుత్వాలు.. సర్కారీ లేబుళ్ళతో లిక్కర్ ప్రవాహాలకు కట్టడి మందు భాగ్య విధాతలుగా మారిపోయాయి. ”మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించి వాహనాలను నడపొద్దు ” అని సీసాలపై ముద్రిస్తే సరిపోతుందా? ఇదేనా! పేరు గొప్ప ప్రభుత్వాలు చేయాల్సింది? ఎంతసేపు వర్తమానాన్ని నెమరువేసుకోవడం కాదు, దేశ భవిష్యత్తును కర్కశంగా బలిపీఠం మీదకు తీసుకెళ్తున్న మద్యరక్కసిని రాష్ట్ర ప్రభుత్వాలు అదుపుచేయాలి. అప్పుడే కోట్లాది కుటుంబాలు ఒడ్డునపడతాయి.

Facebook Comments

Leave a Comment