అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలు ఇంకెన్నాళ్ళు?

వ్యవసాయరంగంలో రైతులకు వచ్చే ఐదేళ్ళలో రైతు ఉత్పత్తులకు రెట్టింపు రాబడులను సాధించడమే కేంద్రప్రభుత్వం లక్ష్యం అని ఒకవైపు చెబుతుంది. కానీ, ఇది క్షేత్రస్థాయిలో ఆశించినంతగా అమలు జరగడం లేదనేది వాస్తవం. ఇటీవలి కాలంలో కిసాన్ యూనియన్ చేపట్టిన ఢిల్లీ యాత్రే మంచి ఉదాహరణ.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం స్వామినాధన్ కమిషన్ సిఫారసులను అమలుచేయాలని, పంటరుణాల మాఫీని అమలుచేయాలని వారు డిమాండ్ చేయడమే పెద్ద నేరమట! అదేంటీ? అని అడిగితే ఆ యాత్ర చేపట్టిన రైతు సంఘం వామపక్షాలకు సంబంధించిన రైతు సంఘమని సమాధానమిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ నుండి సుమారు పది రోజుల పాటు నిర్వహించిన యాత్రను ఢిల్లీలో ర్యాలీ, బహిరంగ సభలతో ముగించే లక్ష్యంతో వారు చేపట్టిన ర్యాలీ అర్ధాంతరంగా బలవంతంగా ముగించాల్సి వచ్చింది. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ కు చేరాలన్న వారి లక్ష్యాలను, పోలీసులు, పారామిలటరీ బలగాల నిర్భందపు చర్యలతో అర్ధాంతరంగా ముగియాల్సి వచ్చింది. వారిపై పెద్ద ఎత్తున భారీ వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని ముందుకు సాగుతున్న రైతన్నలపై పోలీసు జులుం ప్రదర్శించారు. రైతులు వచ్చిన వాహనాల టైర్లలో గాలి తీశారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. ఈ 144 సెక్షన్ వరుసగా పదిహేను రోజుల పాటు అమలు చేశారు. ఈ ఘటనను యుపి ప్రతిపక్షనేత, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు తప్పుబట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రసర్కారు ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.

రైతుల ఆత్మహత్యలను అరికట్టి, రైతాంగంలో నెలకొన్న అసహనం, అలజడిని పారద్రోలాలంటే ముందుగా వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. ప్రాధమిక వ్యవసాయ పరపతి సొసైటీల ద్వారా రైతన్నలకు వడ్డీ లేని రుణాలను అందించాలి. వాటిని తిరిగి సకాలంలో చెల్లించిన వారికి ప్రోత్సాహకాలను ప్రకటించాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. కార్పొరేట్లకు వేలాది కోట్లు రద్ధు చేస్తున్న ప్రభుత్వాలు రైతుల విషయంలో కూడా అదేవిధంగా అనుసరించాలి. అప్పుడే సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగం గట్టెక్కుతుందనడంలో సందేహం లేదు.

Facebook Comments

Leave a Comment