జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న నదులకు పునరుజ్జీవం పోయాలి..!

Photo Source@Livemint

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో నదుల ప్రక్షాళన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైనా, నేటికీ ఏ ఒక్క నదిని కూడా పూర్తిగా శుద్ధి చేసిన దాఖలాలు లేవు. జీవ జలాలను ప్రసాదించే నదులను మనదేశంలో మాతృస్వరూపముగా భావిస్తాం. మన దేశంలో ప్రకృతి వనరుల విధ్వంసం పెచ్చరిల్లుతున్న తీరు కొంత ఆందోళనకు గురిచేస్తోంది.

పారిశ్రామిక వ్యర్ధాలు, గృహావసరాలకు వినియోగించిన నీటిని అందులోకి నేరుగా వదలడంతో అవి మురికి కూపాలుగా మారుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా కలుషితమైన నదుల జాబితాలో సబర్మతీ తో పాటు గోదావరి పోటీ పడుతుంది. అనంతర కాలంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, కుందూ, మూసీ, శబరి, మానేరు తదితర నదుల్లో నీటి నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. నదీ స్నానం మన పాపాలను ప్రక్షాళిస్తుందని బాగా నమ్మేవారు ఆ కశ్మల గుండంలో మునిగి వచ్చేలోగా ప్రాణాలు ఉంటాయో, లేదోనని బెంబేలెత్తిపోతున్నారు. భూగర్భ, ఉపరితల జలాల పరిరక్షణకు, వ్యర్ధాల నిర్వహణకు ఉద్దేశించిన చట్టాలు, నిబంధనలు ఆచరణలో ఏ మాత్రం సాధ్యపడడం లేదు. కొన్ని టన్నుల కొద్దీ విష రసాయనాలు, పశువుల కళేబరాలు యధేచ్చగా వచ్చి చేరుతూ నదుల జీవ లక్షణాలను హరించివేస్తున్నాయి. జలాలను విపరీతంగా వాడడం, అడవులను విచ్చలవిడిగా నరికివేయడం, వాతావరణ మార్పులు జతపడి నదుల రంగు, రుచి వాసనలే కాదు వాటి స్వరూపాలే మారుతున్నాయి. కాలుష్య కారక సంస్థలు, విభాగాలపై, విధిద్రోహాలకు పాల్పడుతున్న అధికార సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఉత్తరాదిన ఉన్న యమునా, కేరళలో ఉన్న నీల నది వంటివి ఎప్పుడో మృత నదులుగా మారిపోయాయి. అక్రమంగా ఇసుక తవ్వడం, ఆక్రమణలు, కాలుష్యం ముప్పేట దాడిలో గోదావరి, కృష్ణా నదులు కుచించుకుపోతున్నాయి.

మూసీ నదీ కన్నా ఎక్కువగా కలుషితమైన సబర్మతి శుద్దీకరణను గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా తీరం వెంబడి ఉన్న వేలాది ఇళ్ళను తొలగించి వారికి వేరే చోట నిర్మించింది. కాలుష్య నియంత్రణ మండళ్ళలో నిజాయితీగా పనిచేసే వారిని నియమించి, పౌరసమాజం సేవలను వినియోగించుకొంటూ ముందుకు వెళితేనే యావత్ భారతానికి జలసిరుల భాగ్యం దొరుకుతుంది.

Facebook Comments

Leave a Comment