ఎన్నికలల్లో ఓట్ల కొనుగోళ్ళతో ప్రజాతంత్ర విలువలు బలి..!

Photo Source: Scroll.in

దృతరాష్ట్ర కౌగిలిగా మారి ఎన్నికల పవిత్రతను అపహాస్యం చేస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించడం కోసం అంటూ ఆయా పార్టీల ఎన్నికల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సూచనలు ఉన్నాయి. అయితే ఆ సూచనలు పెడచెవిన పెడుతున్నా, ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాని పరిస్థితి. అవినీతి వలన, నేరగాళ్ళ కొరకు గా భారత ప్రజాస్వామ్యానికి సరికొత్త అర్ధాన్ని తయారుచేసే స్థాయిలో విస్తరించిందన్న మాట నిజం.

భారత ఎన్నికల సమగ్ర ప్రక్షాళన కొరకు 2004లో 23 ప్రతిపాదనలను, 2016లో 48 సూచనలను ఎన్నికల కమీషన్ కు సమర్పించినా అవన్నీ కూడా కార్యరూపం దాల్చలేదన్నది వాస్తవం. ”చట్టసభకు ఎన్నిక కాబడిన ప్రతి సభ్యుడు కూడా తమ ఎన్నికల ఖర్చును తక్కువ చేసి చూపడంతోనే తమ అవినీతి ప్రస్థానం ఆరంభిస్తాడు ”. రాజకీయనాయకుల గొంతులో పచ్చి వెలక్కాయలాంటి ఈ వాస్తవాన్ని ఎలాంటి సంశయం లేకుండా ఆనాడు భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయీ వెల్లడించారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి సరైన లెక్కలు చూపకుండా పెట్టిన ఖర్చు సగటుగా 55 కోట్ల పైమాటే. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలల్లో ఒక్కో ప్రధాన పార్టీల నాయకుల ప్రచార ఖర్చు సగటున 25కోట్ల పైమాటే అని చెప్పవచ్చు. ఈ లెక్కన ఐదేళ్ళకొకసారి జరిగే పంచాయతీ నుండి పార్లమెంటు దాకా అయ్యే వ్యయం 3,25,000 కోట్లు అని మాజీ ప్రధాన ఎన్నికల కమీషనరే లెక్కగట్టింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి మేము రామంటూ చెప్పుకునే పార్టీలు, పారదర్శకత, జవాబుదారీతనానికి నిలువు పాతరేస్తుంది. ఇది ఎన్నికల సంస్కరణలకు విరుద్ధం. 324 అధికరణ ప్రకారం చట్టసభల ఎన్నికలను స్వేచ్చగా, ఎలాంటి గొడవలకు తావులేకుండా జరపాలని సూచిస్తుంది. స్వేచ్చా నిబంధనలను రూపొందించుకునే అధికారం, సొంతంగా సచివాలయం, సీఈసీ మాదిరిగానే ఇతర కమీషన్లకూ ఉద్యోగ భద్రత వంటి వాటికోసం రెండు దశాబ్ధాలుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఎన్నికలల్లో నల్లధన ప్రవాహాన్ని నియంత్రించాలని గత జూలైలో సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దానిని స్వీకరించిన సుప్రీం ఈసీని సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కట్టి, ఎలక్షన్లలో అక్రమాలు, నల్లధనాన్ని పంచుకోడానికి ఒక అస్త్రంలా ధనస్వామ్యంతో ఆటలాడుతున్నాయి. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ, వారికి డబ్బు ఇవ్వడాన్ని నేరశిక్షా స్మృతి కింద నేరంగా పరిగణించాలన్నది చట్టసవరణ ప్రతిపాదనలోనే ఉంది.

మన దేశంలో సగం రాష్ట్రాల మద్ధతు ఉంటే ఆ బిల్లుకు ఒక రూపం వచ్చేది. కానీ, దానికి సగం రాష్ట్రాల మద్ధతు లేనందున అది నేటికీ పట్టాలెక్కలేదు. ఎన్నికల వేళ ఓటర్లకు బీరు, బిర్యాణీలు, కానుకలు, నగదుతో పాటు మాదకద్రవ్యాలనూ అందించి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విషసంస్కృతిని రూపుమాపాలి. ఆ దిశగా ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనను వెంటనే ప్రారంభించాలని కోరుకుంటూ…
– శ్రీనివాస్ చిరిపోతుల

Facebook Comments

1 Comment on this Post

Leave a Comment