అమెరికాతో అతి సన్నిహితం దేశ సార్వభౌమాధిపత్యానికే ప్రమాదకరం

తన ఆర్ధికాభివృద్ధి, దేశ సార్వభౌమాధిపత్యం, ప్రపంచ దేశాలు తమ కనుసన్నలలో మెదులుతూ తనకు దాసోహంగా వుండాలనే ఆధిపత్య మనస్తత్వం అగ్రరాజ్యమైన అమెరికాది. శత్రు దేశాలను అణగదొక్కేందుకు, తన మిత్ర దేశాలను పావుగా వుపయోగించుకొని, అవసరం తీరాక కూరలో కరివేపాకు చందాన తీసి అవతల పారేసే స్వార్ధపూరిత, కుటిల మనస్థత్వం వున్న అమెరికా యొక్క రణనీతి, యుద్ధకకాంక్షకు ఇరాన్, లిబియా వంటి ఎన్నో దేశాలు శలభాలుగా మారిపోయాయి. ఒకప్పుడు మంచి మిత్రులైన ఇరాన్, ఇరాక్ లు తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయి, నిరంతరం ఒకరిపై మరొకరు యుద్ధం చెసుకునే శత్రుత్వం కుడా అమెరికా చలువే.1970, 80 దశకాలలో సోవియట్ యూనియణ్ తో భారత్ ఎంతో సన్నిహితంగా మెదిలే సమయం లో భారత్ ను ఎలాగైనా అణగదొక్కాలని, మన శత్రు దేశమైన పాకిస్తాన్ ను దువ్వి, లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక సహాయం సైనిక, రక్షణ కొనుగోళ్ళ పేరిట అందించి, తన రక్షణ వ్యవస్థలోని సాంకేతిక పరిజ్ఞ్ఞానాన్ని కొంత మేరకు బదలాయించి, భారత్ కు దీటుగా పాకిస్తాన్ ను నిలబెట్టి, నీ వెనుక మేము వున్నాము, నువ్వు ధైర్యం గా భారత్ ను ఎదిరించి అన్న మొండి ధైర్యాన్ని నూరిపోసి, భారత్, పాకిస్తాన్ దేశాలు ఎప్పుడూ బద్ధ శత్రువులుగా వుండ్దేలా మిత్ర బేధం పాటించింది అమెరికా. అయితే సోవియట్ యూనియన్ విచ్చిన్నమయ్యాక, భారత్ లో వున్న అపారమైన వణిజ్య అవకాశాలను గుర్తించి, వాటిని అందిపుచ్చుకునేందుకు భారత్ దేశం యొక్క శత్రు దేశాలతో పైపైకి శత్రుత్వం నటిస్తూ, లోలోపల వారితో మితృత్వం నెరుపుతూ, భారత్ తో మాత్రం అపారమైన సన్నిహిత్వం నటిస్తొంది పెదన్న అనబడే అగ్రరాజ్యం అమెరికా. భారత దేశం కుడా గత దశాబ్ద కాలం లో అమెరికాతో ఎంతో సన్నిహితం గా మెలుగుతూ వుండడం వలన కొంతమేరకు తన సార్వ భౌమాధిపత్యాన్ని కోల్పోయినట్ట్లే అని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాతో మితృత్వం శ్రుతి మించిన కారణం గానే చైనా, రష్యా,ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు భారత్ తో శత్రుత్వ ధోరణి అవలంబిస్తున్నాయి.

జాతి వివక్షత, ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు ప్రపంచవ్యాపితంగా ఊపందుకుంటున్నాయి. అమెరి కాలో ట్రంప్‌ అనుసరించిన ఈ ఎత్తుగడలనే అనేక దేశాల్లో పాలకవర్గాలు ఎంచుకొంటున్నాయి. తాజాగా ఇజ్రాయిల్‌లోని నెతన్యాహు ప్రభుత్వం జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగడం ద్వారా నవంబరులో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలనే దుర్మార్గవ్యూహంతో ముందుకు కదులుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశ పార్లమెంటు అత్యంత ప్రమాద కరమైన ‘నేషన్‌-స్టేట్‌’ చట్టాన్ని ఇటీవల ఆమోదించింది. ఇజ్రాయిల్‌ను యూదు ప్రజల జాతి-రాజ్యంగా ప్రకటించడమే ఆ చట్ట లక్ష్యం. ఇది పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత సంక్షిష్టంగా మార్చడమే అవుతుంది. సౌదీ అరేబియాలో రాజకీయ కల్లోలం, లెబనాన్‌లో ఉద్రిక్తతలు, యెమెన్‌లో ఘర్షణలు, సౌదీ కూటమికి, ఖతార్‌కు మధ్య వైషమ్యాలు.. వీటన్నింటి వెనుక అమెరికా హస్తం ఉంది. గతం లో ఇరాక్‌ వద్ద క్రిమిరసాయనిక అణ్వాయుధాలు ఉన్నాయన్న నెపంతో ఇరాక్‌పై యుద్ధవిమానాల దాడి చేసి, బాంబుల వర్షం కురిపించి ఆ దేశాన్ని ధ్వంసం చేయడమే కాక, ఆ దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను బహిరంగంగా ఉరి తీసింది. తన ‘డేగకన్ను’ ఏదేశంపై పడితే ఆ దేశంపై దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం అమెరికా నైజం . అమెరికాతో అతి సన్నిహితం దేశ సార్వభౌమాధిపత్యానికే ప్రమాదకరం. ఇంతకుముందు ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం, ట్రాన్స్‌ పసిఫిక్‌ ఒప్పందం (టీపీటీ), ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ఒప్పందం (టీఏటీ), యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, చైనా, రష్యాలతో వాణిజ్య ఒప్పందాల నుండి వెనుతిరిగారు. నాటో నుండి వైదొలుగుతానని బెదిరిస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి అమెరికా వైదొలిగింది. ఇలా అమెరికా ఫస్ట్ పేరిట అమెరికా అత్యంత స్వార్ధ బుద్ధిని ప్రదర్శిస్తూ ప్రాంచ దేశాలలోనే కాకుండా తమ దేశస్థుల నుండి కుడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ చరిత్రలో అతి పెద్ద వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. చైనా, తదితర దేశాలపై ప్రారంభించిన వాణిజ్య యుద్ధంతో ఎంతో కొంత లాభపడవచ్చన్న ఆశ అమెరికా కార్పొరేట్లలో ఉంది. ఇతర దెసాలు ఏమైపోయినా ఫరవాలేదు, తన దేశం మాత్రం సుఖం గా వుంటే చాలునన్న స్వార్ధపూరిత , కుతంతం తో అమెరికా పలు దేసాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభించింది.అయితే ఇందులో తన మిత్ర దేశమని ప్రకటించుకున్న భారత్ ను సైతం వదలకపోవడం అమెరికా ద్వందనీతికి పరాకాష్ట. భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీగా సుంకాలను పెంచేసి, భారత్ ఇరాన్ నుండి ముడి చమురును ఖరీదు చెయ్యడం నవంబరు కల్లా ఆపకపోతే భారత్ నుండి ఏకంగా దిగుమతులను పూర్తిగా ఆపేస్తానని ఏకపక్ష బెదిరింపులకు దిగింది. అంతే కాకుండా జులై లో భారత అమెరికాల మధ్య జరగాల్సిన టు ప్లస్ టు సమావేశాలను రద్దు చేసి , భారత్ తన అడుగులకు మడుగులు ఒత్తకపోతె భవిష్యత్తులో ఎన్నో కష్తలు ఎదుర్కోవలిసి వస్తుందని పరోక్షం గా హెచ్చరించింది.

ఏ దేశం తో కుడా శత్రుత్వం అన్నది లేకుండా అన్ని దేశాలతో మితృత్వం వహించాలన్నదే మన పంచశీల తంత్రం యొక్క స్పూర్తి కూడా. అయితే భారత దేశం కొన్ని హద్దులు దటి, అవసరానికి మించి అమెరికాతో సన్నిహిత్వం వహిస్తుండడం వలన కొన్ని దేశాలకు దూరం అవడమే కాకుండా తన దేశ సార్వ భౌమాధిపత్యాన్ని తాకట్టు పెట్టుకున్నటేఅవుతుంది. అంతే కాకుండా ప్రతీ చిన్న విషయానికి అమెరికా పై ఆధారపడకుండా, కీలక రంగాలలో స్వదేశీయ సాంకేతిక పరిజ్ఞ్ఞాన్ని అభివృద్ధి చేసుకొని, స్వయం సత్తా గల దేశం గా నిలబడడం భవిష్యత్తులో ఎంతో మేలు చెస్తుంది.

Facebook Comments

Leave a Comment