నరరూప రాక్షసులకు కఠిన శిక్షలు పడాలి

Image Source: nlrd.org

అత్యాచారాలకు పాల్పడే మృగాళ్లకు, అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రవర్తించే కీచకులకు ఎప్పటికైనా తగిన శిక్ష తప్పదు. దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన నిర్భయఅత్యాచారం కేసులో నిందితులకు ఐదున్నర సంవత్సరాల అనంతరం సరైన శిక్ష పడింది. సుప్రీం కోర్టు నిందితుల రివ్యూ పిటిషన్‌కొట్టివేసి, కేసులో ముగ్గురు దోషులు – ముఖేష్‌ (24), పవన్‌ గుప్తా (22), వినరు శర్మ (23) లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్‌భూషణ్‌ లతో కూడిన ధర్మాశనం ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. నాలుగో ముద్దాయి రివ్యూపిటీషన్‌ వేయనందున ఇంతకు ముందు సుప్రీం ఖరారు చేసిన ఉరిశిక్షేఆయనకు వర్తిస్తుంది.

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌) అనేక సందర్భాల్లో వార్తాపత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. 2012, డిసెంబర్‌ 16వ తేదీ అర్ధరాత్రి డిల్లీలో జనంకిక్కిరిసి ఉండే ప్రాంతంలో నడుస్తున్న బస్సులో 23 యేళ్ల పారామెడికల్‌ విద్యార్ధిని నిర్భయపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను, 28 సంవత్సరాల ఆమె స్నేహితుడిని బస్సులో నుండి రోడ్డు విూదకు తోసేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని నివాశితులే కాక, దేశవ్యాప్తంగా మహిళాలోకం చలించిపోయింది. తీవ్రంగా గాయపడిన నిర్భయప్రాణాలతో పోరాడుతూ సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబత్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన మహిళాలోకంలో దేశవ్యాపితంగా ఆగ్రహ జ్వాలలుపెల్లుబికాయి. నిర్భయ హంతకులను కఠినంగా శిక్షించాలని ముమ్మర ఉద్యమం సాగింది. నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం వంటి ఘటనలు పునరావృతం కాకుండాకఠిన చట్టం చేయాలని మహిళాలోకం గళగర్జన చేసింది. భద్రతా బలగాలతో శాంతియుతంగా వీధిపోరాటాలు నిర్వహించారు. నిర్భయ దారుణ అత్యాచార ఘటన అనంతరంఆరు రోజులకు కేంద్ర ప్రభుత్వం, మహిళలపై లైంగిక దాడుల పట్ల కఠిన చర్యలు చేపట్టడానికి క్రిమినల్‌ చట్టానికి తగిన సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిజస్టిస్‌ జెఎస్‌ వర్మ నేతృత్వంలో ఒక జ్యుడీషియల్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీలో పదవీ విరమణ చేసిన జడ్జి లీలా సేథ్‌, సుప్రీం కోర్టు న్యాయమూర్తి గోపాలసుబ్రహ్మణ్యం కూడా సభ్యులుగా ఉన్నారు. కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఒక నెల వ్యవధి ఇచ్చారు. ముగ్గురితో కూడిన ఆ కమిటీ వివిధ వర్గాల నుండి తమకుఅందిన దాదాపు 80 వేల సూచనలు, పిటీషన్లను అధ్యయనం చేసి, విశ్లేషించి కేవలం 29 రోజుల్లోనే 2013, జనవరి 23న తన నివేదికను సమర్పించింది. మంత్రుల బృందం ఆనివేదికను అధ్యయనం చేసిన అనంతరం లైంగిక దాడులకు సంబంధించి కఠినమైన శిక్షలను పొందుపరుస్తూ భారతీయ శిక్షాస్మృతిలో మార్పులు చేస్తూ ఒక బిల్లునుతీసుకు వచ్చారు. బిల్లును 2013, మార్చి 19న లోక్‌సభ ఆమోదించగా, మార్చి 21, 2013న రాజ్యసభ ఆమోదించింది. ఏప్రిల్‌ 2, 2013లో బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్రవేయడంతో ఆ మరుసటి రోజు నుండి అది “నిర్భయ చట్టం” పేరుతో అమల్లోకి వచ్చింది. ఆ చట్టంలో అత్యాచారాలకు పాల్పడినట్లయితే ఉరి, జీవిత ఖైదుతో సహా కఠినశిక్షలను పొందుపర్చినప్పటికీ, దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు కొనసాగడం, మహిళాలోకంతో సహా దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. నిర్భయఅత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రామ్‌సింగ్‌ తీహార్‌ జైలు గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడ్ని బాలనేరస్తుల చట్టం ప్రకారంమూడేళ్ల శిక్ష అనుభవించిన అనంతరం విడుదల చేశారు. కాగా మిగిలిన నలుగురు నిందితులు అక్షరు, వినరు శర్మ, పవన్‌, ముఖేష్‌ లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ గత ఏడాదిసుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పున:సవిూక్షించాలని ముగ్గురు దోషులు సుప్రీంలో పిటీషన్‌ వేశారు. సుప్రీం కోర్టు సోమవారం వారి పిటీషన్‌ కొట్టేస్తూ ‘క్యూరేటివ్‌పిటిషన్‌’ వేసుకునేందుకు వారికి అవకాశం కల్పించింది. దీంతో దోషులకు మిగిలింది రెండే మార్గాలు. అయితే, సుప్రీం రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆ ముగ్గురిని ఉరితీసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన రెండు మార్గాలలో ఒకటి శిక్షను తగ్గించాలని సుప్రీంలో క్యూరేటివ్‌ పిటిషన్‌ వేయడం. ఒకవేళ దాన్ని కూడా సుప్రీంత్రోసిపుచ్చినట్లయితే, రెండవది రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడం. ఒకవేళ ఆయన క్షమాభిక్ష పెట్టినా వారికి యావజ్జీవం తప్పదు. దోషులకు సుప్రీం ఉరిశిక్ష ఖరారు చేయడంపైనిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేస్తూ న్యాయం జరగడంలో జాప్యం చోటు చేసుకుందని, న్యాయవ్యవస్థను మరింత పటిష్టవంతం చేయాలని కోరారు. నిర్భయకేసులోచాలా సమయం గడిచి పోవడంతో మహిళలపై అత్యాచార బెడద అంతకంతకూ పెరిగిపోతూనే ఉందని నిర్భయ తండ్రి బద్రీనాథ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నిర్భయచట్టం’ తరువాత కూడా మహిళలపై అత్యాచారాలు కొనసాగడానికి గల కారణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయనిపుణులు అన్వేషించవలసిన అవసరముంది.

న్యాయవ్యవస్థ కూడా అత్యాచార కేసులకు సంబంధించి తీర్పు ఇవ్వడంలో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలి. అదేవిధంగా, మృగాళ్లలో మానసిక పరివర్తనతెచ్చేందుకు మార్గాలను కూడా ప్రభుత్వాలు శోధించాలి. నిర్భయ కేసులో సుప్రీం తీర్పు ప్రేరణతో మహిళలపై అత్యాచారాలకు కళ్లెం వేయడానికి తగిన చర్యలను చేపట్టాలి.

Facebook Comments