ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఐఏఎస్, ఐపిఎస్ లు..!

Image Credits: AAJ TAK

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకున్న పలుకుబడి దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని కేంద్ర హోం శాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. 1989 తరువాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారం కోల్పోయి, కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టినా, తొలిసారి అధికార యంత్రాంగం రెండుగా చీలిపోయింది. అనేక సందర్భాలలో అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన దాఖలాలెన్నో ఉన్నాయి. అందులో భాగంగా కొందరు ఐఏఎస్ గ్రూప్-1 అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టారు. అలా సాహసం చేయలేని అధికారులు పరోక్షంగా తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు గట్టి మద్ధతుదారులుగా నిలుస్తున్నారు.

దాదాపు రెండు దశాబ్ధాల కాలంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడిన అధికారుల్లో.. జయప్రకాష్ నారాయణ, విజయరామారావు, వరప్రసాదరావు, జేడీ శీలం, రంగయ్య నాయుడు, కె.ఎస్.ఆర్ మూర్తి వంటి వారు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్వ డిజీపి దినేష్ రెడ్డి మల్కాజ్ గిరి లోక్ సభ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బిజెపిలో చేరారు. 2000 వ సంవత్సరంలో రాష్ట్ర మాజీ డిజిపి ఎం.వి భాస్కరరావు సొంతంగా ఆంధ్ర నాడు పార్టీని స్థాపించినా సఫలం కాలేకపోయారు. వీరిలో పి.వి రంగయ్య నాయుడు కేంద్రమంత్రిగా, విజయరామారావు రాష్ట్రమంత్రిగా వ్యవహరించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర స్థాయి ఐఏఎస్ కేడర్ లో, అత్యున్నత ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఆయన, పదవీ విరమణ పొందాక, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ పదవిని స్వీకరించారు. అయిదు కోట్ల మంది ప్రజలకు అధికారిగా వ్యవహరించిన ఆయన వారి సామాజికవర్గానికి లోబడి పనిచేశారు.

ప్రజాధనంతో అత్యంత విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తూ, అధికార బాధ్యతలను నిర్వహిస్తూ, ఆ గ్లామర్ తో రాజకీయాలలోకి ప్రవేశించి, ఏం అద్భుతాలను సాధిద్దామనుకుంటున్నారో అంతుచిక్కని ప్రశ్న.. వర్తమానంలో మరో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం, పూర్వ సిబిఐ జెడి లక్ష్మీనారాయణలు వరుసగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు, వారు ఇస్తున్న ఇంటర్వ్యూలు భవిష్యత్ రాజకీయాల్లో ఏ మేరకు పరిణామాలకు దారి తీస్తాయో వేచిచూడాలి.

Facebook Comments

Leave a Comment