వివాహేతర సంబంధాలకు పచ్చ జెండా ఊపిన సుప్రీం తీర్పు సరైనదేనా?

Photo Source: Free Press Journal

వివాహేతర సంబంధాలు ఐపీసీ సెక్షన్ 497 ఏం చెబుతుందంటే భార్య తన భర్త అనుమతి లేకుండా ఇతర పురుషులతో వివాహేతర సంబంధం కలిగి ఉంటే, ఆ భర్త అలాంటి సంబంధం కలిగి ఉన్న పురుషుడిపైన నేరం నమోదు చేసి 5 ఏళ్ళ వరకూ శిక్ష వేయవచ్చు. కానీ ఆ బంధానికి భర్త అనుమతి ఉంటే అది నేరంగా పరిగణింపబడదు. మరి అలా సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఒకవేళ వివాహం జరిగివుంటే అతని భార్య పరిస్థితి? ఆమె కూడా అతని మీద కేసు పెట్టుకోవచ్చా. ఈ సెక్షన్ ప్రకారం అయితే అలా కేసు పెట్టడానికి వీలులేదు.

ఇది ఒక మహిళా శరీరం మీద ఇద్దరు పురుషుల హక్కుకు సంబంధించిన చట్టం మాత్రమే. అందుకే సుప్రీం కోర్టు ఈ సెక్షన్ ను కొట్టిచేసిందన్న మాట..భార్యకు భర్తే యజమాని కాడు. అయితే దీంతో వివాహేతర సంబంధాలకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపిందా అంటే లేదు. ఇది కేవలం నేరశిక్షాస్మృతి కింద నేరం కాదు. కానీ, విడాకులకు ఒక కారణంగా కొనసాగుతోంది. అంటే ఈ వివాహేతర బంధాల కారణంగా విడాకులు అడిగే హక్కు కొనసాగుతోంది. కుటుంబ చట్టాల్లో దీనికి లింగ్ వివక్ష లేదు. స్త్రీ, పురుషులిద్దరూ ఆ కారణంగా విడాకులు అడిగే అవకాశం ఉంటుంది. వివాహబంధంలో ఒక క్షోభ కారణంగా కుటుంబ చట్టాల్లో ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టంలో కూడా ఇది కొనసాగుతోంది. సెక్షన్ 497 ఉన్నప్పుడు కూడా ఆమెకు దాన్ని ఒక నేరంగా నమోదు చేసే అవకాశం లేదు. అలాంటి కారణాలతో పోలీసు స్టేషన్ కు పోయి ఆ పురుషుడి మీద కేసు పెట్టడానికి ఏ కేసు లేక, తెలిసీ తెలియని అజ్ఞానపు పోలీసు వ్యవస్థ సలహాలతో 498 ఎ కేసులు పెట్టి వాటిని రుజువు చేయలేక భంగపడిన భార్యలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి పురుషులని శిక్షించాలా అంటే దానికి సమాధానం చెప్పే ముందు ఇంకా చాలా చూడాలి. పెళ్ళి అనేది ఒక బాధ్యత. ఒకసారి పెళ్ళి చేసుకొని పిల్లలను కన్నాక వాళ్ళ పట్ల బాధ్యత చూపడం మానవ ధర్మం. కానీ భార్యా పిల్లలను వదిలేసి ఇతర సంబంధాల్లోకి వెళ్ళే అనేక మంది పురుషులు తాము చేసుకొన్న పెళ్ళికి గౌరవప్రదంగా విడాకులతో ముగింపు పలికి పిల్లల బాధ్యతలను తీసుకోవాలని గానీ, వారి భవిష్యత్తుకు ఏదైనా చేయాలని ఆలోచించరు. తమ సంబంధాలను ప్రశ్నించినందుకు, భార్యాపిల్లలని శిక్షించాలని చూస్తారు. ఆ భార్యలు చివరకు ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చులను భరిస్తూ తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒకటి రెండు తీర్పులు దానికి భిన్నంగా ఉన్నా కూడా మన జ్యుడీషియరీలో కూడా పాతుకుపోయిన ఫ్యూడల్ తత్వం దానికి అంగీకరించదు. కాబట్టి ఒకే తప్పు స్త్రీ, పురుషులిద్దరూ చేసినా దానిని వచ్చే సామాజిక స్పందన చాలా భిన్నం అని అర్ధం చేసుకోవాలి. అందుకే ఈ తీర్పు సందర్భంగా రాజ్యాంగం ముందు స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అన్న ధర్మాసనం వ్యాఖ్య కూడా చాలా కీలకం.

కాబట్టి సెక్షన్ 497ను కొట్టివేయడాన్ని స్వాగతించాలన్నది విశ్లేషకుల అభిప్రాయం. దానితో పాటే గ్రౌండ్ మీద ఉన్న ఈ సమస్యలకు ముఖ్యంగా వివాహబంధాల్లో, వివాహేతర బంధాల వల్ల నిర్లక్ష్యానికి గురవుతున్న భార్యలు ముఖ్యంగా పిల్లలకు కూడా ఒక పరిష్కారం చూపిస్తే బాగుంటుంది.

Facebook Comments

Leave a Comment